– లేక ప్రభుత్వం నిర్ణయించాలా?
– ఇది మానవ హక్కుల పరిరక్షణ కోసం
– రాజ్యసభలో ట్రాన్స్‌జెండర్స్ హక్కులు-2026 సవరణలు బిల్లుపై ఎంపీ వద్దిరాజు ప్రసంగం
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో ట్రాన్స్జెండర్ల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి పలు చర్యలు తీసుకోవడం జరిగిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ట్రాన్స్ జెండర్స్ హక్కులు -2026 సవరణల బిల్లుపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ఎంపీ రవిచంద్ర పాల్గొని ప్రసంగించారు. ఈ చట్టం గురించి మాత్రమే కాకుండా, ఇది వారి స్వాభిమానం,సమాజంలో గౌరవం,సమాన హక్కుల గురించి చర్చించాల్సిన అవసరం ఉందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
మన దేశంలో చాలా కాలంగా వివిధ లింగ గుర్తింపులను అంగీకరించే సంప్రదాయం ఉందని,హిజ్రాలు, కిన్నర్లు వంటి సమాజాలు మన సంస్కృతిలో భాగంగా ఉన్నాయన్నారు.అయినా కూడా, ఈ రోజుకి కూడా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వివక్ష, నిరాకరణ, జీవనోపాధి అవకాశాల లోపం ఉందని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. అయితే, తెలంగాణలో కేసీఆర్ వారి కోసం పలు సంక్షేమ పథకాలు,కార్యక్రమాలు మొదలుపెట్టి పకడ్బందీగా అమలు చేశారన్నారు.
పింఛన్లు అందజేయడమే కాక జీవనోపాధికి ఆర్థిక చేయూతను కూడా అందజేయడం జరిగిందని, ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకున్నారని తెలిపారు.కానీ,ఇంకా కూడా వారికి సమస్యలు ఉన్నాయని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.వారికి ఉన్నత విద్య,ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉందన్నారు.
ఈ పరిస్థితిని మార్చడానికి 2019లో ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) చట్టం తీసుకు రావడం జరిగిందని,ఇది ఒక మంచి అడుగు,ఈ చట్టం ద్వారా వారికి హక్కులు ఇవ్వాలని, రక్షణ కల్పించాలని ప్రయత్నించారని ఎంపీ వద్దిరాజు వివరించారు. ఇప్పుడు 2026లో కొత్త సవరణ బిల్లు తీసుకువచ్చారని,ఇందులో కొన్ని మంచి మార్పులు ఉన్నాయని,కానీ కొన్ని విషయాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
ట్రాన్స్‌జెండర్ అనే నిర్వచనం గురించి,చట్టంలో విస్తృతంగా నిర్వచనం ఉండేదని,కానీ ఇప్పుడు అది తీసేసి, కొన్ని కేటగిరీలను మాత్రమే చేర్చారని, కొన్ని గుర్తింపులను తీసేశారన్నారు.
మన గుర్తింపును మనమే నిర్ణయించుకోవాలా? లేక ప్రభుత్వం నిర్ణయించాలా?అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు.గుర్తింపు అనేది వ్యక్తిగతమైనదని,దానిని అందరూ గౌరవించాలన్నారు.
ఐడెంటిటీ సర్టిఫికేట్ కోసం ఈ కొత్త బిల్లులో ట్రాన్స్‌జెండర్ వ్యక్తి జిల్లా కలెక్టర్ దగ్గర దరఖాస్తు చేయాల్సి ఉంటుంది,అది కూడా ఒక మెడికల్ బోర్డు సిఫారసుతో మాత్రమే ఇస్తారని ఇందులో పేర్కొనడం జరిగిందన్నారు. ఇది ఒక విధంగా చూస్తే సిస్టమ్ తీసుకురావడం లాంటిదని,కానీ మరోవైపు, ఇది వ్యక్తిగత విషయాల్లో అనవసరమైన జోక్యం కూడా అవుతుందని ఎంపీ రవిచంద్ర అభిప్రాయపడ్డారు.
లింగ మార్పు సర్జరీ చేసిన తర్వాత తప్పనిసరిగా కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి అని కూడా బిల్లు చెబుతుందన్నారు. ఆసుపత్రులు కూడా ఈ సమాచారాన్ని ఇవ్వాలని,ఇది ప్రైవసీపై ప్రశ్నలు లేవనెత్తుతుందని చెప్పారు. అయితే, ఈ బిల్లు కొన్ని బలమైన చర్యలు కూడా తీసుకుందని, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై జరిగే తీవ్రమైన నేరాలపై కఠిన శిక్షలు పెట్టిందని చెప్పారు. బలవంతంగా ట్రాన్స్‌జెండర్‌గా మార్చడం కిడ్నాప్ చేయడం, తీవ్రమైన హాని చేయడం, బలవంతంగా బిచ్చగాడిగా, బానిసలా పని చేయించడం ఈ నేరాలకు భారీ శిక్షలు, జరిమానాలు ఉండడం అనేది
ఒక మంచి విషయమని ఎంపీ రవిచంద్ర అన్నారు.
ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుంటోందన్నారు. సమాజంలో ఇంకా వివక్ష ఉందని, పాలసీలు మాత్రమే కాకుండా, వాటి అమలు కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్, అవగాహన చాలా అవసరమని, చట్టాలు చేయడం ఒక్కటే సరిపోదని, మన ఆలోచనలు కూడా మారాలని హితవు పలికారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా మనలాగే సమాన హక్కులు పొందాలని, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు,మంచి వైద్య సదుపాయాలు, విద్యలో సమాన హక్కులు ముఖ్యంగా, సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగు అని ఎంపీ రవిచంద్ర వివరించారు.
కానీ ఇది మరింత సమగ్రంగా ఉండాలని,కష్టాలు పెంచకూడదని, ఎవరైనా సరే, వారి లింగ గుర్తింపుతో సంబంధం లేకుండా గౌరవంగా జీవించే సమాజాన్ని మనమందరం కలిసి నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం ట్రాన్స్‌జెండర్ హక్కుల గురించి మాత్రమే కాదు, మానవ హక్కుల పరిరక్షణ కోసం అని ఎంపీ వద్దిరాజు చెప్పారు.