– ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు వినతి
గుంటూరు – జూన్ 21:- కరోన సమయంలో రద్దయిన జర్నలిస్టు రైల్వే పాస్ ల రాయితీ పునరుద్ధరణకు కృషి చేయాలని ఏపీడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యునిగా రెండవసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన లావు కృష్ణదేవరాయలను నిమ్మ రాజు చలపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ ఏకే మోహన్ రావు లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు లో హైదరాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదలకు కృషి చేయాలని ఆ ప్రాంత జర్నలిస్టులు కోరుతున్నారని విజ్ఞప్తి చేశారు. గత ఎనిమిదేళ్ల క్రితం ఒక ఎక్స్ప్రెస్ రైలుకు పెదకూరపాడు లో స్టాపింగ్ ఇచ్చారు. అయితే టికెట్ ముద్రణ లేక పోవటంతో కౌంటర్లో చేతితో రాసి టిక్కెట్టు ఇచ్చేవారు. గుంటూరు నుండి సత్తెనపల్లికి, పెదకూరపాడుకు చార్జీ 9 రూపాయలు ఉండటంతో సత్తెనపల్లికి టికెట్ ఇస్తుండటంతో ప్రయాణికులు తగ్గుముఖం పట్టారనే నెపంతో అప్పట్లో స్టాపింగ్ ఎత్తివేసారని చలపతిరావు గుర్తు చేశారు.
గడచిన మూడేళ్లలో పల్నాడు జిల్లాలోని మారుమూల గ్రామాలన్నింటికీ బిఎస్ఎన్ఎల్ సేవలను విస్తృత పరిచేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎంతగానో కృషి చేశారని అన్నారు. వెనుకబడ్డ పల్నాడు ప్రాంతానికి బిఎస్ఎన్ఎల్ సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విరివిగా సెల్ టవర్లను ఏర్పాటు చేయాలని చలపతిరావు కోరారు. ఇందుకు శ్రీ కృష్ణ దేవరాయలు సానుకూలంగా స్పందించారు.