– ఆర్ ఎంవో సరస్వతీదేవి సస్పెన్షన్
– ఆర్డీవో, డీఎంహెచ్వో, డీఎస్పీ బృందంతో విచారణకు ఆదేశం
– అంబులెన్స్ మాఫియా వాస్తవమేనని ధ్రువీకరించిన అధికారులు
– రుయా అధికారులపై చర్యలు తీసుకొన్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి
– మహా ప్రస్థానం వాహనాలు రాత్రిళ్లు కూడా పనిచేసేలా చర్యలు
– ప్రీపెయిడ్ ట్యాక్సీల విషయాన్ని పరిశీలిస్తాం
– ప్రభుత్వాస్పత్రుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు
– తిరుపతి రుయా ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది
– వైద్యశాఖ మంత్రి రజనీ ఆదేశం
ఈ సందర్భంగా రజనీ ఏమన్నారంటే… రుయా ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించాం. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతికి షోకాజ్ నోటీసు ఇచ్చాం.
ఆర్ ఎం వో సరస్వతీదేవి ని విధుల నుంచి తొలగించాం. ఇంకా బాధ్యులెవరున్నారన్నది పూర్తి స్థాయి విచారణ తర్వాత తెలుస్తుంది. బాధ్యులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. జరిగిన ఘటన అత్యంత అమానవీయమైనదే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశించాం. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. పోలీసు శాఖ తరఫున కూడా చర్యలు తీసుకుంటాం. మహా ప్రస్థానం పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నడుస్తున్న వాహనాల్ని రాత్రిళ్లు కూడా అందుబాటులోకి తెస్తాం. మృతదేహాల్ని తరలించేందుకు ప్రీ పెయిడ్ ట్యాక్సీలు అందుబాటులో ఉండేలా కొత్త విధానాన్ని తీసుకొస్తాం.