– తగ్గుతున్న బ్యారేజి సామర్ధ్యం తక్షణమే పూడిక తీయాలంటూ ప్రభుత్వానికి అధికారుల లేఖ
– అమరావతి వైపు ఒత్తిడి పెరిగే అవకాశం
– కొత్త జాతీయ రహదారితో బఫర్కు ఎఫెక్ట్
కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ ఎగువన అమరావతికి సమీపంగా పెద్దఎత్తున సిల్టు పేరుకుపోతోంది. దీంతో చిన్న ద్వీపాలు భారీగా విస్తరించాయి. సీఎం ఇంటికి సమీపంలో మరో కొత్తదీవి ఏర్పాటైంది. దీంతో బ్యారేజి సామర్ధ్యం గణనీయంగా తగ్గుతోంది. 2009, 2024లో వచ్చినట్లు 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వస్తే చుట్టుపక్కల ప్రాంతాలపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
2024లో వచ్చిన వరదలకు బ్యారేజీ వద్ద దిబ్బలు అడ్డు ఉండటంతో నీటి ఒత్తిడి ఎన్టిఆర్ జిల్లావైపు విస్తరించిందని,ఆ వరదతో దీవులు మరింత విస్తరించాయని, ఈసారి అంతే పరిమాణంలో వస్తే ఇబ్బంది ఏర్పడొచ్చని అధికారులు అంటున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా వైపు మట్టి కోతకు గురైంది. దీనివల్ల సిల్టు పేరుకుపోవడంతో ప్రకాశం బ్యారేజీలో ఇప్పటికే నిలువ సామర్ధ్యం 0.40 టిఎంసిలు తగ్గింది.
గతంలో మూడు టిఎంసిలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 2.60 టిఎంసిలు మాత్రమే ఉంటోంది. అది కూడా విద్యుత్ ప్లాంటుకు నీటిని అందించడం కోసం నిల్వ చేస్తున్నారు. అలాగే పెరిగిన ఒండ్రుమేట, మట్టి తదితర కారణాలతో బ్యారేజి 1.14 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక ఉందని అధికారులు సర్వేలో తేల్చారు. అలాగే గతంలో ఐదు దిబ్బలు ఉన్నాయని, ఇవి మరింత పెరిగాయని సర్వేలో తేల్చారు.
దీని ప్రభావం గుంటూరు జిల్లావైపు మట్టి కోతకు గురవుతోందని గుర్తించారు. ఇప్పుడు కొత్తగా ఎన్టిఆర్ జిల్లా వైపు కృష్ణానది బఫర్జోన్లో జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. దీనివల్ల నీటి ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణానదిలో పేరుకుపోయిన మట్టిని తొలగించాలని కోరుతూ జలవనరులశాఖ అధికారులకు లేఖ రాశారు. వీలైనంత త్వరగా తొలగిస్తే మంచిదని పేర్కొన్నారు. ఇందులో మట్టిని, ఇసుకను వాడుకునేందుకు సిఆర్డిఏకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
మరోవైపు కృష్ణానదిలో దిబ్బలకు సంబంధించి ఎన్జిటిలో కేసు నడుస్తున్నందున జిఓ అమల్లోకి రాలేదు. అలాగే మట్టిని వినియోగించుకునేలా యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకోలేదు.. వీలైనంత త్వరగా పూడిక తొలగింపు పనులు ప్రారంభించకపోతే 10 లక్షల క్యూసెక్కులు వరదనీరు వస్తే ఆ ఒత్తిడి గుంటూరు జిల్లావైపు పడుతుందనే భయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరగా పూడికతీత పనులు చేపట్టాలని కోరుతున్నారు.
– వల్లభనేని సురేష్
అమరావతి రాజధాని సమగ్ర అధ్యయనవేత్త, విశ్లేషకులు
9010099208