– సింగపూర్ మళ్లీ మనలను నమ్మి వస్తుందా?
(బిబి)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తక్షణం, అమరావతి రాజధాని ప్రాజెక్టుపై మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి. దానికన్నా 90 డిగ్రీల లంభకోణం లెక్కన మన మీద విదేశాల నమ్మకం కూడా.. సులభంగా నిటారుగా లేస్తుంది అని భ్రమపడ్డ వారు కూడా వున్నారు.
ఇక్కడ దేవతల రాజధానికి ధీటైన భూలోక అమరావతి మీద, పాతాళ స్థాయి విష ఆలోచనలను కక్కే నాగులకు కొదవలేదు. కాలకూట విష ‘వడ్డీ’లతో బుసలు కొడుతూ బెజవాడలోనే వృద్ధ జంబూకాలు సైతం, చక్రాల కుర్చీలలో ప్రాకుతూ వస్తున్న పాపపు అకాలాన్ని చూస్తున్నాం. వారి కంటే అంతా వేశ్యాలమయం అని విశ్లేషణలు చేస్తున్న రాక్షస నాలుకలను చూస్తున్నాం.
ఒకప్పుడు ఈ కలల రాజధాని నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఉన్న సింగపూర్, ఇప్పుడు తిరిగి తమ ఆసక్తిని చూపుతున్న స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ ఆశల పునరుజ్జీవనానికి గతంలో జరిగిన చేదు అనుభవాలు ఒక గుణపాఠంగా నిలుస్తున్నాయి.
మూడు రాజధానుల నిర్ణయం కారణంగా గత ప్రభుత్వం సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేయడంతో, 2023లో సింగపూర్ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్, ఏపీ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఇది కేవలం ఒక చట్టపరమైన తీర్పు మాత్రమే కాదు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిలో ఒక ఎన్నికైన ప్రభుత్వంపై ఏర్పడిన విశ్వాసం ఎలా సన్నగిల్లుతుందో, దాన్ని తిరిగి పొందడం ఎంత కష్టతరమో రుజువు చేసిన ఒక చేదు జ్ఞాపకం.
విశ్వాస పునరుద్ధరణకు యత్నం!
అయినప్పటికీ, 2024 జూన్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో పరిస్థితిలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. అమరావతిని ఏకైక, ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం, గత అనుభవాల చేదును పక్కన పెట్టి, సింగపూర్‌ను తిరిగి భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తోంది.
ఇది కేవలం నిధులు, నైపుణ్యం కోసమే కాదు, గతంలో దెబ్బతిన్న అంతర్జాతీయ విశ్వసనీయతను పునరుద్ధరించాలనే తపనకు కూడా నిదర్శనం.
దీనికి బలం చేకూర్చే విధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల జూలై 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన అజెండాగా సాగే ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, భరత్, పలువురు ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకోనున్నారు.
సింగపూర్‌లోని వ్యాపార వర్గాలతో, నగరాల ప్రణాళిక, సుందరీకరణ, ఉద్యానాలు, ఓడరేవులు, మౌలిక వసతులు, మరియు భవిష్యత్తు సాంకేతికత వంటి అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్నారు.
ప్రస్తుతం, అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) వంటి అంతర్జాతీయ సంస్థల నుండి కూడా నిధులు సమకూరుతున్నాయి. ఎందుకంటే దాని విలువను అవి తెలుసుకొన్నాయి. డబ్బులు ఊరకరావు కదా.
గతంలో ప్రాజెక్టును విడిచిపెట్టిన సింగపూర్ సంస్థలు, ఇప్పుడు కొత్త టెండర్లలో పాల్గొని తమ నైపుణ్యాన్ని తిరిగి అమరావతి నిర్మాణంలో వినియోగించుకునే అవకాశం ఉంది. దశాబ్దాల కలను మోస్తున్న అమరావతికి, రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, కేంద్రం అండ, మరియు అంతర్జాతీయ సహకారం కలగలిస్తేనే ఒక రూపు వస్తుంది.
ఒకసారి భగ్నమైన నమ్మకాన్ని తిరిగి నిర్మించుకోవడం సవాలుతో కూడుకున్నదైనా, ముఖ్యమంత్రి పర్యటన సింగపూర్-అమరావతి బంధానికి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించి, ఆశల పతాకగా నిలిచిన రాజధాని కల నిజంగానే రూపుదిద్దుకుంటుందో లేదో అని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉద్వేగంతో, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.