– ప్రతిష్టాత్మక ఏసియా పసిఫిక్ హెచ్ఆర్ఎం కాంగ్రెస్ వారి ద్వారా పురస్కారం ప్రదానం
హైదరాబాద్: సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడుపుతూ, గత ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో పాటు వివిధ వ్యాపార విస్తరణ చర్యలతో సంస్థకు గట్టి ఆర్థిక పునాదులు వేసిన సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.
దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ సంస్థల నాయకుల కేటగిరీలో అత్యుత్తమ సీఎండీగా గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ఏసియా పసిఫిక్ హెచ్ఆర్ఎం కాంగ్రెస్ వారు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏసియా పసిఫిక్ హెచ్ ఆర్ ఎం కాంగ్రెస్ వారు గురువారం సాయంత్రం బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో ఈ అవార్డును ఆయన స్వీకరించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఇన్ మేనేజ్మెంట్ (కోల్కతా) ఛైర్మన్ , డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.పి.బెనర్జీ, అడ్వాంటెజ్ గ్రూప్ వ్యవస్థాపకురాలు స్మితి భట్ దియోరా తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ సంస్థ ఆర్థిక వ్యవహారాలలో ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ ప్రక్రియ చేపట్టి సంస్థకు బలమైన ఆర్థిక పునాది వేశారు. ముఖ్యంగా సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రమైన ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాకును ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు. వ్యాపార
విస్తరణ చర్యల్లో భాగంగా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించడం కోసం రెండు ఏజెన్సీలను ఏర్పాటు చేసుకొని అధ్యయనం జరుపుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కూడా దక్కించుకోవడం విశేషం. రాజస్థాన్ లో సోలార్, థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకోవడంలో ప్రత్యేక చొరవ చూపారు.
కార్మిక సంక్షేమ కార్యక్రమాలు, సమీప గ్రామాల్లో సామాజిక బాధ్యత కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేయడాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. అదే సమయంలో కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కార్మికులందరికీ కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సంస్థ వ్యాపార విస్తరణలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వయంగా 20 వేల కు పైగా మొక్కలు నాటడాన్ని కొనియాడారు. గత ఏడాది కాలంగా చేపట్టిన విస్తృత అభివృద్ధి, సంక్షేమ, సీఎస్ఆర్ కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు బహూకరించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
తనకు ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది సింగరేణి కార్మికులు, అధికారుల సమష్టి కృషికి దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సింగరేణిని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు.