-పేద విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజా ప్రభుత్వం సాయం
-ముఖ్యమంత్రి ఆదేశాలతో చెక్కు అందజేసిన గిరిజన శాఖ అధికారులు
హైదరాబాద్ : జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది.
‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికతో వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పేదింటి చదువులతల్లికి తక్షణమే సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకొని మాట్లాడి, వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్ కు తీసుకువచ్చారు. సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ గారి ద్వారా విద్యార్థిని మధులతకు రూ 1,51,831 చెక్కును అందజేశారు.
విద్యార్థిని కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం ఇప్పుడిచ్చిన రూ.70వేలకు అదనంగా మరో రూ.30వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని అధికారులు భరోసా ఇచ్చారు.
ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక చదువుకోలేనేమో అని ఆందోళన చెందుతోన్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే మీడియా ద్వారా సమస్యను తెలుసుకొని మానవత్వంతో స్పందించినందుకు సంతోషంగా ఉందని విద్యార్థిని మధులత అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో ట్రీకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, గిరిజనశాఖ అధికారులు పాల్గొన్నారు