* తెలంగాణ రైజింగ్ కాదు.. తెలంగాణ క్లోజింగ్
* ప్రజాపాలనలో విధ్వంసం, దోపిడీకి రెండో ఏడాది
* రెండేండ్ల పాలనలో ప్రమాదంలోకి తెలంగాణ అస్థిత్వం
* అమలుకాని ఆరు గ్యారెంటీలు.. కానరాని 420 హామీలు
* హైదరాబాద్‌ను కేంద్రానికి అప్పగించేందుకు కుట్ర
* తెలంగాణ నాలెడ్జ్ క్రియేషన్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో
* రెండేండ్ల పరిపాలనలో ఏం జరిగింది? అంశపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్: ప్రజలకు పాట్లు.. ప్రతిపక్షాలకు తిట్లు.. దేవుడిపై ఒట్లు.. అనునయులకు నోట్లు.. అనే నినాదంతో తెలంగాణలో రెండేండ్ల కాంగ్రెస్ పాలన కొనసాగిందని బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎరోళ్ల శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల పాలనలో ఏం జరిగింది? అనే అంశంపై తెలంగాణ నాలెడ్జ్ క్రియేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెకర్టర్ గోసుల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన హైదరాబాద్ సోమాజిగూడలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎరోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… విజయోత్సవాలు దేనికోసం నిర్వహిస్తున్నారని, గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నందుకు చేసుకుంటున్నారా? రైతు బంధు, రైతు బీమా, బోనస్‌లు అందక వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు జరుపుకొంటున్నారా? అంటూ నిలదీశారు. తెలంగాణలో రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో దోపిడీ, దొంగతనాలు, విధ్వంసాలకు ఇది రెండో ఏడాది దినం అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజల గౌరవాన్ని అరాజు పాట పాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రగతిని పక్కకు నెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
ప్రజాదర్బార్ పేరిట నిత్యం ప్రజలను కలుస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించిన వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. చివరకు సీఎం సొంత గ్రామానికి జర్నిలిస్టులు వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థి నెలకొందన్నారు. రెండేండ్లలో చేసింది ఏమీ లేకపోవడంతోనే విజయోత్సవాలని చెప్పుకుంటూ ప్రతిపక్షాలను తిట్టడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటన్నా పూర్తిస్థాయిలో అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన రూ.2.5 లక్షల కోట్ల అప్పులను ఏ పథకానికి వినియోగించాలని చెప్పాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నేతల ఆస్తులు రైజింగ్
‘కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్లు రెండేండ్లలో తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ క్లోజింగ్ అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. రెండేండ్లలో కాంగ్రెస్ నేతలు, వారి సన్నిహితుల ఆస్తులు రైజింగ్ అయ్యాయి. పేదలు, రైతులు, నిరుద్యోగులు, యువత సహా అన్ని వర్గాల ప్రజల కలలు క్లోజింగ్ అయ్యాయి. రాష్ట్రంలో ప్రజలపైకి బుల్డోజర్లు వెళ్తున్నాయి. డ్రగ్స్ దందాను మహారాష్ట్ర పోలీసులు వచ్చి గుర్తించేదాకా ఈగల్ టీమ్ మొద్దు నిద్ర పోతున్నది. రాష్ట్రానికి నాయకుడు సబ్జెక్టు ఉన్నవారు ఉంటే.. అధికారులు కూడా పనిచేస్తారు. కానీ సబ్జెక్టు లేని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటం వల్లనే అధికారులు కూడా పనిచేయడంలేదు.
అత్యంత కీలకమైన హోం మంత్రి, విద్యా శాఖ మంత్రి లేకపోవడం అత్యంత దారుణం. ఇంత జరుగుతుంటే కోదండరాం, ఆకునూరి మురళి వంటి మేధావులు నిద్రపోతున్నారా? గురుకులాల్లో వసతులు కల్పించకుండా పిల్లల చావులకు కారణమవుతున్న వాళ్లు.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను కడతామనడం హాస్యస్పదంగా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నట్లు ఇతర దేశాలతో కాదు.. అవినీతి, అక్రమాలతో పోటీ పడుతున్నారు’ అని ఎరోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
ఈకార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్ కన్వినర్ ఆర్ వెంకట్ రెడ్డి, ప్రొఫెసర్ పాపారావు, రైతు వేదిక చైర్మన్ పులి రాజు, ముస్లిం రైట్స్ ఫోరం కన్వినర్ జమ్లుద్దీన్, మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, బీజీ యువజన సంఘం అధ్యక్షుడు పిల్లి నాగరాజు, బస్తీ సంఘాల జేఏసీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, బస్తీవాసుల మహిళా నేతలు అమ్మాజి, అశోక కుమారి, బీజీ సంఘాల గ్రేటర్ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ కళాకారుడు మద్దెల సందీప్
హైదరాబాద్‌ను కేంద్రానికి అప్పగించే కుట్ర: పల్లె రవికుమార్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్
తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసి, చరిత్రను పాతరేసి భవిష్యత్తులో కేంద్రానికి అప్పగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారు. దుర్మార్గుడి పాలనలో క్లోజింగ్ తెలంగాణగా మారతున్నది. ఏండ్ల తరబడిగా ఉద్యమం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చుకున్న మనకు రాష్ట్రంతో పేగు బంధం ఉంది. తెలంగాణ నాశనం కోరుకున్నవారు, తెలంగాణ ద్రోలు ఈనాడు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ కోసం జైలు పాలైనవారు ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవి బంధం ఉన్నది. విలీనం పేరిట అసలైన హైదరాబాద్‌ను తెలంగాణ పేరిట వేరు చేసి.. ఉత్తరాది వాళ్లకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధి జీవులమని చెపుకుంటున్న కొందరు రెండేండ్ల కాంగ్రెస్ విధ్వసాన్ని చూస్తూ తటస్థంగా ఉంటామని చెప్తున్నారు. బాధితుల పక్షాన నిలబడకుండా తటస్థంగా ఉంటామని చెప్పేవాళ్లు బుద్ధి జీవులు ఎలా అవుతారు? తెలంగాణ ద్రోలు అవుతారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనతో విధ్వసం సృష్టించి అన్ని వర్గాల ప్రజలను అభద్రతాభావంలోకి నెడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు వదిలి ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలు: వెంకట్‌రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్
రెండేండ్ల కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో 40 లక్షల మందికి పైగా ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 30 లక్షల కంటే తక్కువగా ఉన్నారు. విద్యాశాఖ, హోం శాఖ మంత్రి లేకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుపడుతున్నది. మంత్రులంతూ విభిన్న శాఖలు నిర్వహిస్తూ ఏ శాఖకూ సరైన న్యాయం చేయలేకపోతున్నారు. విజన్-2047 అని చెపుకుంటున్న ప్రభుత్వానికి గద్వాల, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఇప్పటికీ పిల్లలు బడికి పోలేని స్థితిలో ఉన్నారని తెలుసా?
పాలన ఇలాగే కొనసాగితే వారి పరిస్థితి 2047కు కూడా అలాగే ఉంటుంది. పాలనను వికేంద్రీకరణ చేయాల్సి ప్రభుత్వం మున్సిపాలిటీలను హైదరాబాద్‌లో చేరుస్తూ కేంద్రీకరణకు పాల్పడుతున్నది. ఇది తెలంగాణ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరం. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులం అరికట్టేందుకు మంత్రి లేని దుస్థితి తెలంగాణలో ఉండటం దురదృష్టకరం. మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరిట బస్తీలు కూలుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
తెలగాణకు గ్రహణం పట్టింది: సుమిత్రానంద, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు గ్రహణం పట్టింది. సకల వర్గాలను మోసం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని, కనీసం ఒక్క చీరను కూడా ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని రెండేండ్లయినా ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. విద్యార్థినులు, యువతులను అన్ని రకాలుగా మోసం చేశారు. అబద్దానికి అంగీలాగు తొడిగితే రేవంత్‌రెడ్డి అయితే.. అవి రెండూ తీసేస్తే రేవంత్‌రెడ్డి సర్కారు అవుతుంది.
పబ్లిసిటీ ఫుల్.. పరిపాలన నిల్…: వాసుదేవరెడ్డి, వికలాంగుల మాజీ ఛైర్మన్
రెండేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనలో పబ్లిసిటీ ఫుల్.. పరిపాలన నిల్ గా సాగింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బూటకమే. ఆరు గ్యారెంటీల్లోని 13 అంశాలు అని నట్టేట ముంచారు. రేవంత్‌రెడ్డికి తెలంగాణ పట్ల అవగాహన లేదు.. తెలంగాణపై సోయి లేదు. ఎంబ్లమ్, కాకతీయ కాళాతోరణం, తెలంగాణ తల్లిని మార్చి ప్రజల మనోభావాలను, అస్థిత్వాన్ని అవమానించారు. కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో సచివాలయానికి పేరు పెట్టి పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే ఆ ప్రాంగణానికి తాళం వేసిన మూరుడు సీఎం రేవంత్‌రెడ్డి. అమర దీపం నిర్మిస్తే ఏనాడు నివాళులు అర్పించలేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సీటును కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. జ్యాబ్ క్యాలెండర్లో జాబ్‌లు లేవు. రైతులు, నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి గెలుపొంది నమ్మక ద్రోహం చేశారు.
తెలంగాణలో రెండేండ్ల సంక్షోభం: ప్రొఫెసర్ పాపారావు
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో తెలంగాణ సంక్షోభంలో కూరుకుపోయింది. ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలతో అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పేరిట ప్రజల చేతిలో నిత్యం డబ్బులు తిరగుతూ ద్రవ్యోల్బణం హెచ్చు స్థితిలో ఉండేంది. ఇప్పుడు ఆ పథకాలన్నీ ఆగిపోవడంతో ద్రవ్యోల్బణం ప్రమాదకర స్థితిలోకి చేరింది. అభివృద్ధి అటెకెక్కి అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అరచేతిలో స్వర్గం చూపిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతలు ప్రజలను మోసం చేసి విజయోత్సవాలు చేసుకుంటున్నారు.