– మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటా పై తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ఐఎఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ స్పందించారు.
దివ్యాంగుల పై స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని అన్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, పర్యవసనాలను ఆలోచించకుండా మాట్లాడటం తగదని మంత్రి సురేఖ సూచించారు. తమ మాటల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళుతుందో దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.
శారీరక సామర్థ్యం కంటే మానసిక సామర్థ్యమే ముఖ్యమని స్మితా సభర్వాల్ గుర్తించాలని మంత్రి సురేఖ అన్నారు. గొప్ప సంకల్ప బలంతో శారీరక దుర్భలత్వాన్ని జయించి ఈ ప్రపంచానికి స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన మహోన్నత వ్యక్తులెందరో ఉన్నారనే విషయాన్ని స్మితా సభర్వాల్ గమనించాలని మంత్రి సురేఖ సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో వివక్షకు తావులేదని, అన్ని వర్గాల హక్కులకు రక్షణ ఉంటుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.