-వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోంది
-విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇది
-మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులపై కేంద్ర మంత్రి వైఖరిని తప్పుబట్టిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ వ్యతిరేకించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. కేంద్ర మంత్రి వైఖరి నిరుత్సాహపరిచిందని, మహిళల బాధను కేంద్ర మంత్రి విస్మరించారని అసహనం వ్యక్తం చేశారు.
నెలసరి సమయంలో మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనవసరం లేదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ కవిత “ఎక్స్”లో పోస్ట్ చేశారు.
రుతుక్రమ పోరాటాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి కొట్టిపారేయడం విచారకరమని, మహిళల బాధలను స్మృతీ ఇరానీ విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. “నెలసరి ఎంపిక కాదు. అది సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళలు అనుభవిస్తున్న బాధను విస్మరించినట్లే. మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోంది. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇది. ” అని ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు.