మోదీ చేసిన అభివృద్ధి మీకు కన్పించడం లేదా?
– కాంగ్రెస్ ఏం చేసిందని ఆ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు?
– 6 గ్యారంటీలు నెరవేర్చిందా? మేనిఫెస్టో హామీలను అమలు చేసిందా?
– నైతికత ఉంటే ఆ పదవులకు రాజీనామా చేసి మాట్లాడండి
– భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయడమే మా లక్ష్యం
– ఆర్థిక ప్రగతిలో భారత్ ను 4వ స్థానానికి చేర్చాం
– మరి మీరు సాధించిందేమిటి?
– అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే…. మతతత్వం అని ముద్ర వేస్తారా?
– మీరు ప్రభుత్వంలో భాగస్వాములపై ఏసీల్లో కూర్చుని అమాయకులను రెచ్చగొట్టి తుపాకులు పట్టిస్తారా?
– రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టించి వారు చావులకు కారకులవుతారా?
– మీ మాయమాటలు నమ్మి అమాయకులు అడవుల్లో తిరుగుతూ చస్తున్నారు
– మోదీ అభివృద్ధిని చూసి నక్సలైట్లు లొంగిపోతున్నా…. మీలో మార్పు కన్పించదా?
– కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నా…
– బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఎన్నికల ముందు దుష్ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?
– రాష్ట్రంలో ఆర్కే (రేవంత్ రెడ్డి, కేటీఆర్) పాలన కొనసాగుతోంది
– భవిష్యత్లో రాజమౌళి దేవుడిని నమ్ముతారని ఆశిస్తున్నా…
– కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : అర్బన్ నక్సల్స్, కమ్యూనిస్టు పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కళ్ళుండి చూడలేని కబోదులని అభివర్ణించారు. అమాయకులను రెచ్చగొట్టి ఆయుధాలు చెతపట్టించి వారు చావులకు కారకులైన అర్బన్ నక్సల్స్ సాధించిందేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని ఆ పార్టీకి మద్దతిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లకు ఏమాత్రం నైతికత ఉన్నా… ఆ పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చి వాస్తవాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం బీజేపీ రాష్ట్ర నేతలు జి.మనోహర్ రెడ్డి, ఎస్.కుమార్, డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, డాక్టర్ శిల్పారెడ్డి, తదితరులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
నగరాల్లో, పట్టణాల్లో ఏసీ రూముల్లో ఉంటూ బూటకపు ఎన్ కౌంటర్ల గురించి మాట్లాడుతున్న సోకాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్ ఎన్నడైనా లొంగిపోవాలని చెప్పారా? వాళ్లు చనిపోయాక మాత్రం బూటకపు ఎన్ కౌంటర్లని మాట్లాడుతూ పాటలు పాడి శవాలకు నివాళి అర్పించడం తప్ప వాళ్లు చేసిందేమిటి? ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడాలని వాళ్లే ఆందోళనలు చేస్తారు. ఇంకోవైపు అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టి నక్సలిజంలో చేరాలని అమాయకులను రెచ్చగొడతారు! ఇదేం ద్వంద్వ నీతి. అసలు వాళ్లకు స్పష్టత, లక్ష్యం ఉందా?
బీజేపీకి ఒక లక్ష్యం ఉంది. బ్యాలెట్ ను నమ్ముకుని బీజేపీ వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. కోట్లాది మందికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్నం. 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చినం. కోట్లాది మందికి ఉచితంగా రేషన్ సహా సంక్షేమ పథకాల లబ్ది చేకూరుస్తున్నం. ఆర్థిక ప్రగతిలో భారత్ ను 4వ స్థానానికి తీసుకొచ్చి అమెరికా, రష్యా, చైనా, జపాన్ సరసన చేర్చినం. మా లక్ష్యం 2047 నాటికి వరల్డ్ నెంబర్ వన్ దేశంగా భారత్ ను మార్చేందుకు వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్నాం… మరి మీ లక్ష్యం ఏమిటి?.
మోదీ సంక్షేమ పథకాలు మీకు కన్పించడం లేదు? మేం చేసిన అభివృద్ధి కన్పించడం లేదు? ఉచిత రేషన్ బియ్యం కన్పించదు. 10 లక్షల మందికి రోజ్ గార్ మేళా పేరుతో ఉద్యోగాలిచ్చినం. గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. చిట్ట చివరి వ్యక్తికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించాలని దీన్ దయాళ్ సిద్దాంతాన్న అమలు చేస్తున్నాం… మేం ఇన్ని చేసినా మీకు కన్పించదు. మేం చేసిన అభివృద్ధి కన్పించదు. మతతత్వవాదులని ముద్ర వేస్తారు. ఇదేం పద్ధతి?
కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎగ్గొట్టారు? భూమలిచ్చారా? ఉద్యోగాలిచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకు నెలనెలా రూ.2500 లు ఇచ్చారా? వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు నచ్చింది ఏమిటి? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు తీసుకుని భాగస్వాములు అవుతున్నారు.?
ఆయుధం పట్టిన వాళ్లకు ఆనందం ఉండదు. జీవితాంతం టెన్షనే. తిండి తిప్పలు లేక కుటుంబ సభ్యులకు దూరమై అల్లాడుతుంటే అర్బన్ నక్సలైట్లు మాత్రం ఏసీ గదుల్లో ఎంజాయ్ చేస్తూ మావోయిజం వర్ధిల్లాలి… తాడిత పీడిత వర్గాలు ఏకం కావాలంటూ మాయ మాటలు చెబుతూ పబ్బం గడుపు కుంటున్నారు. చిన్నపిల్లలకు తుపాకులిచ్చి కాల్చమని చెప్పడం ఏం సిద్ధాంతం?
‘‘ఏసీల్లో ఉండి కబుర్లు చెప్పడం సరికాదు… సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ లు పెట్టడం కాదు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తూ పాటలు పాడటంకాదు. మీకు నైతికత, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఉంటూ పదవులు పొందిన వాళ్లు, కమిషన్ లో, కమిటీల్లో ఉన్న వారు తక్షణమే ఆ పదవులకు రాజీనామా చేయాలి. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అడవిలో ఉన్న నక్సలైట్లు గుర్తించి లొంగిపోతున్నారు. మీకు మాత్రం అభివృద్ధి కన్పించదా? అర్బన్ నక్సల్స్ మాటలు వింటుంటే… సీనియర్ కమ్యూనిస్టు నాయకుడొకరు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. 60 ఏళ్ల తరువాత కమ్యూనిజం గురించి మాట్లాడితే వాళ్లకు మానసిక రోగం ఉన్నట్లే.
కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతిని మేం స్వాగతిస్తున్నాం
మాజీమంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతివ్వడాన్ని మేం స్వాగతిస్తున్నాం…. ఇన్నాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ఎన్నికలకు ముందు ఆరోపించిన సీఎం ఇప్పుడేమంటారు? రాష్ట్రంలో ఆర్కే (రేవంత్ రెడ్డి, కేటీఆర్) పాలన కొనసాతోంది. అవినీతికి పాల్పడే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం సహించదు. కచ్చితంగా చర్యలుంటాయి. నేను అభివృద్ధిపై మాట్లాడితే మీడియా ఇవ్వడం లేదు… హిందుత్వంపైనే ఫోకస్ చేస్తున్నారు. భవిష్యత్తులో రాజమౌళి దేవుడిని నమ్మేలా చూడాలని, ఆయన బాగుండాలని కోరుకుంటున్నా.