October 15, 2026

‎విద్యతోనే సమాజాభివృద్ధి

  • ‎ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ విద్యారంగం
  • విద్యకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెద్దపీట
  • ఉపాధ్యాయులే భావి తరాల నిర్మాతలు..
  • 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంలో భాగస్వాములు కావాలి
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
    ‎

హైదరాబాద్: ‎విద్య ద్వారానే సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలను అధిగమించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ, భారీగా నిధులు కేటాయించడంతోపాటు విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. ప్రపంచంతో పోటీపడే స్థాయిలో తెలంగాణ విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జీ తెలుగు న్యూస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గురు వందనం–ఎడ్యుకేషన్‌ కాంక్లేవ్‌ అండ్‌ టీచర్స్‌ అవార్డ్స్‌–2026’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు.

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థులను ఉన్నతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు మరింత చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని, విద్యారంగ అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు డీఎస్సీ ద్వారా పెద్దఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, జూనియర్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్ల నియామకాలను కూడా పూర్తి చేశామని భట్టి విక్రమార్క తెలిపారు.. రాష్ట్రంలోని గురుకుల, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్‌ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్‌ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనికి అదనంగా వారానికి మూడు రోజులు పాలు లేదా రాగిజావ అందించే కార్యక్రమాన్ని కూడా విస్తరిస్తున్నామని చెప్పారు.

‎ అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 105 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను మంజూరు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు భవిష్యత్తులో గేమ్‌ ఛేంజర్‌గా మారుతాయని భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య ద్వారా తెలంగాణ సమాజం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమై ప్రపంచంతో పోటీపడే స్థాయికి చేరుకుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవ రావు, పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జీ న్యూస్ సిఈఓ మరియు ఎడిటర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.

Total Visitors: 2,970,896