Suryaa.co.in

Andhra Pradesh

‘ప్రజా దర్బార్’కు వస్తున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి

– ప్రతి 15 రోజులకొకసారి ప్రత్యేకంగా లోకేష్‌ భేటీ
– వివిధ శాఖలకు సంబంధించి ఎన్ని వచ్చాయి
– వాటిలో ఎంతమందికి న్యాయం చేశాం…
– ఆ వివరాలపై స్వయంగా ఆరా తీస్తున్న మంత్రి
– స్వయంగా తానే మంత్రులతో సంప్రదింపులు
– త్వరగా ఆయా సమస్యలు పరిష్కరించాలని ఆదేశం
– 41వ రోజు ప్రజల విన్నపాలు
– అండగా ఉంటానని మంత్రి హామీ

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’ కు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నపాలు అందజేశారు. 41వ రోజు కార్యక్రమంలో ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు

– అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని ఉండవల్లికి చెందిన కే.మంగ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– ఇంజనీరింగ్ చదివిన తాను నిరుద్యోగిగా ఉన్నానని, వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్న తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని, విజయ డైయిరీలో ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన కె.రాణి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
– తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లి సుందరయ్య నగర్ కు చెందిన నాగేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు.
– కుటుంబ పోషణ కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని నవులూరుకు చెందిన ఎలిజాల వెంకటరమణ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు

అనారోగ్యంతో భర్త, రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయి ఏకాకిగా మారిన తనను ఉన్న కోడలు ఆదరించడం లేదని, కుమారుడి మృతితో ప్రభుత్వం, బీమా ద్వారా అందిన రూ.65 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం అనుభవిస్తూ కోడలు దుర్గాభవాని తనకు అన్యాయం చేసిందని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వడ్డెంగుంట శేషవాణి మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు.

2012లో వినుకొండ ఆర్టీసీ డిపోలో ఏడీసీగా పనిచేస్తూ అనారోగ్యంతో భర్త మరణించారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన కుమారుడు 2021లో జరిగిన అనుమానాస్పద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రభుత్వం అందించిన ఆర్థికసాయం, బీమా పరిహారం, ఉద్యోగం కోడలికే దక్కింది. ఎలాంటి ఆధారం, ఆస్తిపాస్తులు లేని తనను పట్టించుకోకుండా రోడ్డున పడేసి, కోడలు మానసికంగా వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నానికి చెందిన గాదె గోపాలకృష్ణ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని, ఇప్పటివరకు రూ.6 లక్షల వరకు ఖర్చు చేశామని, ఇంకా రూ.20 లక్షల వరకు వ్యయమవుతుందని వైద్యులు తెలిపారని కన్నీటిపర్యంతమయ్యారు. డ్రైవింగ్ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు ఆర్థిక స్థోమత లేదని, ఆర్థికసాయం అందించి కుమారుడి ప్రాణాలను నిలపాలని కోరారు.

అధిక వడ్డీ వసూలుతో తీవ్రంగా నష్టపోయాయని, విచారించి తగిన న్యాయం చేయాలని విజయవాడకు చెందిన జక్క వీరస్వామి విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉండే జాస్తి రమణి వద్ద నాలుగేళ్ల క్రితం రూ.2 లక్షల వరకు అప్పుచేశానని, అయితే రూ.10 వడ్డీ అంటూ బెదిరించి ఇప్పటివరకు తనవద్ద నుంచి రూ.7.50 లక్షలు వసూలు చేశారని, మరో రూ.4 లక్షలు చెల్లించాలంటూ వేధిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.

దివ్యాంగురాలినైన తనకు ఎలాంటి ఆధారం లేదని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంకు చెందిన జి.సుగుణ విజ్ఞప్తి చేశారు.

గత 9 దశాబ్దాలుగా గ్రామంలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను గత ప్రభుత్వం మూసివేసిందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తిరిగి పునరుద్దరించాలని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తూర్పు పెద్దివారిపాలెం, యద్దనపూడి మండలం పడమర పెద్దివారిపాలెం గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఇంజనీరింగ్ చదివిన తనకు శ్రీ సిమెంట్స్ కంపెనీలో శాశ్వత ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన నల్లమేకల అశోక చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు మంత్రి హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE