– రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా
అమరావతి: న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా ప్రభుత్వ శాఖల మధ్య నెలకొన్న భూసమస్యలకు ముగింపు పలికేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (భూపరిపాలన, సర్వే సెటిల్ మెంట్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, విపత్తుల నిర్వహణ), ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్ధ డైరెక్టర్ జనరల్ ఆర్ పి సిసోడియా అన్నారు. అటవీ, రెవిన్యూ శాఖల మధ్య నెలకొన్న భూవివాదాల పరిష్కారం ధ్యేయంగా మంగళవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధ కార్యాలయంలో అత్యున్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు.
రెవిన్యూ, సర్వే సెటిల్ మెంట్, అటవీ, మారిటైమ్ బోర్డు, ఎపిఐఐసి ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ సమావేశాన్ని భూపరిపాలన విభాగపు చీఫ్ కమీషనర్ జయలక్ష్మి సమన్వయ పరిచారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ ఉన్నత స్ధాయి అధికారులు క్షేత్ర స్ధాయికి వెళ్లి వాస్తవ సరిస్ధితులను అధ్యయనం చేసినప్పుడే సరిహద్దు వివాదాలకు ముగింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను ఇబ్బంది కలిగిస్తున్న భూవివాదాలకు సత్వరమే పరిష్కారం చూపవలసి ఉందని, మంచి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం రాజాపురం గ్రామం మూలపేటలో 408.67 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ మారీటైమ్ బోర్డుకు బదలాయించే అంశాన్ని ఉన్నత స్ధాయి సమావేశం చర్చించింది. సర్వే నెంబర్ 299, 304, 305లలోని ఈ భూమిలో మూలపేట గ్రీన్ ఫీల్ట్ పోర్టు నిర్మాణం చేయాలన్న ప్రతిపాదనకు కమిటీ సమ్మతి తెలిపింది. ఈ భూమికి సంబంధించి అటవీ, రెవిన్యూ శాఖ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే దిశగా సిసిఎల్ఎ వ్యవహరించాలని సిసోడియా స్పష్టం చేశారు. మారీటైమ్ బోర్డు కోరుతున్న భూమిలో అటవీ భూమి కూడా ఉన్నందున ఆ శాఖకు ప్రత్యామ్నాయంగా ఎక్కడ భూమి చూపాలన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.
నెల్లూరు రూరల్ మండలం అమనచర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 303/1లోని 502.12 ఎకరాల భూమి విషయంలో ఎపిఐఐసి, అటవీ శాఖ మధ్య యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నెలకొంది. సుదీర్ఘ చర్చ అనంతరం ఈ అంశం న్యాయ పరమైన వివాదాలతో అనుసంధానం అయిఉన్నందున ఈ అంశంపై మరింత స్పష్టత అవసరమని సమావేశం అభిప్రాయపడింది. మరింత సమాచారం, న్యాయ సలహా మేరకే తగిన చర్యలు తీసుకోవాలని సిసోడియా, జయలక్ష్మి స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి, శకునాల గ్రామాల పరిధిలోని 365.66 ఎకరాల విషయంలో నెలకొన్న సరిహద్దు వివాదంపై కూడా సమావేశం లోతుగా చర్చించింది. గని రిజర్వ్ పారెస్ట్ కు, అక్కడ నిర్మాణం కావాలసిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు భూములకు మధ్య సరిహద్దు రేఖ పరంగా అస్పష్టత నెలకొంది. ఈ అంశంపై సిసోడియా స్ఫష్టత నిస్తూ రెవిన్యూ, అటవీ శాఖల సంయిక్త ఆధ్వర్యంలో రీసర్వే నిర్వహించాలని అదేశించారు. రికార్డులను పూర్తి స్ధాయిలో అధ్యయనం చేయాలని, సర్వే సమయంలో కలెక్టర్ క్షేత్రస్దాయికి వెళ్లి వాస్తవ స్ధితి గతులను పరిశీలించి సిసిఎల్ఎకు నివేదిక సమర్ఫించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అజయ్ కుమార్ నాయక్, సర్వే సెటిల్ మెంట్ అదనపు సంచాలకుడు గోవిందరావు, కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషా, శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దిన్ కర్ పుండ్కర్, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.