– ఎమ్మెల్సీ అంజిరెడ్డి
హైదరాబాద్: ఈనెల 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్ చందర్ రావు ఆధ్వర్యంలో, కరపత్రం, స్టిక్కర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్సీ, తెలంగాణ విమోచన దినోత్సవాల కమిటీ చైర్మన్ అంజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాట చరిత్రను తెలియజేసే ప్రత్యేక రజకార్ సినిమా ప్రత్యేక స్క్రీనింగ్‌ను సెప్టెంబరు 11న నిర్వహించనున్నాం. ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబరు 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించనున్నాం. సెప్టెంబర్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి ప్రజలలో చైతన్యం కల్పిస్తాం. సెప్టెంబర్ 13న రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన యోధుల చరిత్ర స్థలాలను సందర్శించాలి. సెప్టెంబర్ 14, 16 తేదీల్లో రాష్ట్రస్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి రజకార్ల అకృత్యాల గురించి , పోరాట యోధుల గురించి ప్రజలకు తెలియజేయాలి.
సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తోంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతి జిల్లాలో జాతీయ జెండా ఎగురవేయాలి. 1948 సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’ పేరిట సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యపూర్వక చర్యలతో భారత సైన్యం నిజాం పాలనను ఓడించి, హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించారు. ఒక ప్రాంతానికి స్వేచ్ఛ దొరికిన రోజు అంటే అది గొప్ప పండుగ. కానీ తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిన సెప్టెంబర్ 17న ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వకుండా, నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టడం అన్యాయం.
నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగమైన, కర్నాటక, మహారాష్ట్రలో కలిసిన జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక విముక్తి దినోత్సవాలను నిర్వహిస్తున్నా, 17 సెప్టెంబర్‌ను అధికారికంగా గుర్తించడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు నిర్వహించలేదు. ఉద్యమ కాలంలో 17 సెప్టెంబర్‌ను అధికారికంగా ఎందుకు జరుపలేదు అని నిలదీసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వరం మార్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేశారు. ఇప్పుడు నిజాం పాలనను ఎదుర్కొని పోరాటం చేసిన యోధుల త్యాగాలు, చరిత్ర నేటి తరానికి తెలియాల్సినదే. అందుకే, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బిజెపి నిరంతరం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విస్మరించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి ప్రతి సంవత్సరం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలు ప్రారంభించిన తర్వాత… అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి చరిత్రను భావితరాలకు తెలియజయడమే బిజెపి ధ్యేయం. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించే ఫైలుపై సంతకం చేసి దీన్ని ఖరారు చేస్తామని హామీ ఇస్తోందని తెలిపారు