రాజ్యసభలో విద్యా శాఖ మంత్రికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పిన కేంద్ర విద్యా సంస్థలకు శాశ్వత కాంపస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ యూనివర్శిటీస్ సవరణ బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయంతోపాటు దాదాపుగా అన్ని కేంద్ర విద్యా సంస్థలను ప్రారంభించింది.
అయితే వాటికి శాశ్వత కాంపస్‌ల నిర్మాణంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా ఆయా విద్యా సంస్థలలో కొన్ని ఇంకా తాత్కాలిక కాంపస్‌ల నుంచే పనిచేస్తున్నాయి. దీని వలన ఆ విద్యా సంస్థలలో కోర్సులు, ఇతర అకడమిక్ కార్యకలాపాల విస్తరణకు అవకాశం లేకుండా పోతోంది. శాశ్వత కాంపస్‌ల నిర్మాణం పూర్తయితేగాని ఈ విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో తమ అకడమిక్ కార్యకలాపాలను నిర్వహించ లేవు. కాబట్టి ఆయా విద్యా సంస్థల శాశ్వత కాంపస్‌ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వాటిలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని శ్రీ విజయసాయి రెడ్డి విద్యా శాఖ మంత్రిని అభ్యర్ధించారు.