–క్రీడా హబ్ గా తిరుపతి మారడం తధ్యం: ఎంపీ గురుమూర్తి
–జర్నలిస్టు లకు క్రీడలు అవసరం: కమిషనర్ గిరీష
–క్రీడలతో క్రమశిక్షణ, మేధస్సుకు పదును:ఎస్పీ వెంకట అప్పలనాయుడు
– ఘనంగా జే శాప్ 10 వార్షికోత్సవ వేడుకలు
– హాజరైన 13 జిల్లాల జర్నలిస్ట్ ప్రతినిధులు
తిరుపతి: మారుతున్న పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో క్రీడ ఓ భాగం కావాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి వెటర్నరీ కళాశాల ఆడిటోరియంలోఆదివారం జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆప్ ఆంధ్రప్రదేశ్( జేశాప్) 10వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 13 జిల్లాలకు చెందిన జేశాప్ ప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ జర్నలిస్తులకు స్పోర్ట్స్ అసోసియేషన్‌గా ఏర్పడి 10 ఏళ్ళపాటు ద్విగ్జయంగా క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిత్యం సమాచార అన్వేషణకోసం తపించే జర్నలిస్టులు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారన్నారు. తాను జర్నలిస్టుగా పనిచేసినందున ఆ సాదక బాధలు తెలుసన్నారు. ఈ క్రమంలో జర్నలిస్టులకు క్రీడలతో శారీరక ధృఢత్వమే కాకుండా మానసిక వికాసం లభిస్తుందన్నారు. జర్నలిస్టులకు సమాజం ఎంతో బాధ్యత ఇచ్చిందన్నారు. అన్ని రంగాలను నియంత్రించే శక్తి జర్నలిస్టుకు ఉందన్నారు. డబ్బు సంపాదించడం కన్నా జ్ఞానం సంపాదించడమే అతి కష్టమన్నారు.
జర్నలిస్టులు తమ ప్రతిభ చూపడానికి, బుద్ది బలానికి శారీరక ధృఢత్వం తోడైతే చక్కగా రాణించగలరన్నారు. జ్ఞానం కోసం అన్వేషించడానికి బుద్ది బలం వాడితే మరింత రాణిస్తారన్నారు. జర్నలిస్టుల క్రీడ పోటీలను నిర్వహిస్తున్న జేశాప్ నిర్వాహకులను ఆయన అభినందించారు. తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి తిరుపతి నగరం క్రీడా హబ్‌గా మారుతుందనడానికి జాతీయ కబడ్డీ టోర్నీ, జర్నలిస్ట్ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ ఓ ఉదాహరణ అన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక ధారుడ్యానికి ఉపయోగకరమన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరిషా మాట్లాడుతూ తిరుపతిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టామని, త్వరలో అందుబాటులో తీసుకురానున్నామన్నారు. ఇందిరా మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టామన్నారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ జేశాప్ 10 వసతంతాలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల్లో కనిపించిన క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి ఎందరికో ఆదర్శమన్నారు. మరిన్ని కార్యక్రమాలు చేపట్టి జర్నలిస్టుల్ని క్రీడలవైపు ఆకర్షితుల్ని చేయాలన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు జేశాప్ రా్రçష్ట అధ్యక్షుడు దుర్గారావు సభా అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, సెక్రటరీ శివశంకరయ్య , కృష్ణమరాజు, ఓబులం ప్రసాద్, జిల్లా కమిటీ పద్మనాభం, సురేంద్ర, బాలచంద్ర, శ్రీనివాసులు, 13 జిల్లాలకు చెందిన జేశాప్ ప్రతినిధులు పాల్గొన్నారు.