కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం, జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఏకశిలా విగ్రహాలతో (సీత, రాముడు, లక్ష్మణుడు) వెలసిన పురాతన క్షేత్రం. హనుమంతుడు లేని రామాలయం కావటం ఇక్కడి విశేషం.
మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, శ్రీ రాముల వారు సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది.
ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చారు.
ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్, దీనిని భారతదేశంలోని అత్యంత విశాలమైన దేవాలయ గోపురాలలో ఒకటిగా పేర్కొన్నారు. అంతే గాక పోతన తను రచించిన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించారు.ఒంటి అంటే ఒక అని అర్థం.
ఒక మిట్టమీద నిర్మింపబడ్డ రామాలయం అవటంవల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చిందని అంటారు. మరో కథనం ప్రకారం గతంలో చోర వృత్తిలో ఉన్న ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. వారి పేరుతోనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని అంటారు.
ఆంధ్ర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణోత్సవానికి దేశంలోనే విభిన్న నేపథ్యం ఉంది. అన్నిచోట్లా పగటి పూట కల్యాణం నిర్వహిస్తే ఇక్కడ మాత్రం నిండు పున్నమి వెన్నెల్లో రాత్రివేళ కళ్యాణం జరపడం ఓ ప్రత్యేకత.
నిండు పున్నమి వెన్నెలలో వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ జానకీరాముల పరిణయ మహోత్సవం ఆద్యంతం కన్నుల పండుగగా సాగుతుంది.
శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ , భరత , శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి.
చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కల్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కల్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కల్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం.
రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కల్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు.
ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
( ఒంటిమిట్ట సీతారామ కల్యాణం సందర్భంగా)
– ములుకుట్ల సువర్చల.