తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం రథోత్సవం కన్నులపండుగగా జరిగింది.ఉదయం 8.40 గంటలకు రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.
రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.
రథోత్సవంలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈవో ఎవి ధర్మా రెడ్డి, జేఈవో వీర బ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, ఎస్ ఈ-3 సత్యనారాయణ ,ఈఈలు మనోహర్, నరసింహ మూర్తి , విఎస్వో బాలి రెడ్డి, , ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో రమేష్ ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.