– భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదం
అమరావతి: వెంకటాయపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కల్యాణాన్ని వీక్షించేందుకు విచ్చేసిన వేలాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు ఎంతో క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో విశేషంగా సేవలందించారు.
దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, విజిలెన్స్ విభాగాలకు సంబంధించి కల్యాణ వేదిక ప్రాంతాలలో భక్తులకు సేవలందించారు. శనివారం సాయంత్రం నుండి గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందించారు.
అదేవిధంగా భక్తులకు శ్రీవారి లడ్డు, పసుపు, కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కల్యాణోత్సవం అక్షింతలు కలిపి ఉన్న బ్యాగ్ లను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు. భక్తులు గ్యాలరీలలోనికి వచ్చేందుకు మాడ వీధులలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, గ్యాలరీలలోని ముఖ్యమైన ప్రాంతాలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు టిటిడి అధికారులకు, సిబ్బందికి సహకరించారు.
శ్రీనివాస కల్యాణానికి విచ్చేసే భక్తులకు 150 మంది శ్రీవారి సేవకులు తిరునామధారణ సేవలందించారు. అమరావతి సరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులు అందించిన సేవల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేసి అభినందించారు.
భక్తులకు శ్రీవారి చిన్న లడ్డూ ప్రసాదాలు
తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన 50 వేల చిన్న లడ్డూలను కల్యాణానికి విచ్చేసిన భక్తులకు అందించారు.
అన్నప్రసాదాలు
టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో అమరావతి అక్షయ పౌండేషన్ వారు 40 వేల పులిహోరా, 40 వేల పెరుగు అన్నం, 40 వేల రవ్వ కేసరి, 40 వేల స్వీటు ప్యాకెట్లు భక్తులకు అందించారు.