– భాగ్యనగరంలో కంచిపరమాచార్య ప్రతిష్ఠించిన తొలి ఆలయం
– ఐదు దశాబ్దాల నాటి పురాతన ఆలయంలో భక్త జన సందోహం
– శ్రీగిరిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పోటెత్తుతున్న భక్తులు
– భద్రాచలం తరహాలో కొత్త నిర్మాణాలకు శ్రీకారం
సికింద్రాబాద్ శ్రీనివాసనగర్ శ్రీగిరిలో కొలువుదీరిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర దేవస్థానంలో, శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తజన జయజయధ్వానాల నడుమ, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
భాగ్యనగరంలో కంచిపరమాచార్య, నడిచే దేవుడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి.. 56 ఏళ్ల క్రితం శ్రీశైలంలో తపస్సు చేసి, భాగ్యనగరానికి విచ్చేసి తమ అమృతహస్తాలతో ప్రతిష్ఠించిన ఈ తొలి ఆలయంలో, తిరుమల మాదిరిగానే దశాబ్దాలనుంచి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ పరంపరలో భాగంగా ఆలయంలో, 45వ వార్షిక బ్రహోత్సవాలు కూడా భక్తుల జయజయధ్వానాల నడుమ జరుగుతున్నాయి.
ప్రతిరోజు అంకురార్పణ, ధ్వజారోహణము, దేవతాహ్వానము, అభిషేకము, శేషవాహనసేవ, తిరుప్పావడ సేవ, హంసవాహనసేవ, శ్రీవారికల్యాణోత్సవము, గరుడవాహనసేవ, ముత్యపుకవచాలంకరణ,గజవాహనసేవ, అశ్వవాహన సేవలకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కంచి స్వామిచే బాలాలయ ప్రతిష్ఠ
కాగా 1968 సెప్టెంబరు 6న.. నడిచే దేవుడయిన కంచి పరమాచార్య ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని, పునర్మిర్మాణం కోసం తిరిగి అదే కంచిపీఠానికి చెందిన జగద్గురువు శ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామి,2022 జూన్ 10న బాలాలయానికి ప్రతిష్ఠ నిర్వహించి, ఆశీర్వదించారు. ఐదు దశాబ్దాల నాటి ఈ పురాతన ఆలయాన్ని తిరిగి, 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్ నిర్మాణానికి పాలకవర్గం సంకల్పించింది. అందులో భాగంగా భద్రాచలం మాదిరిగా, దక్షిణామూర్తి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించారు.
‘‘ భక్తుల సహకారం అనూహ్యంగా లభిస్తోంది. అందుకు ఆ పరమాచార్యుని ఆశీస్సులే కారణం. తొలుత ఈ ఆలయ నిర్మాణానికి శ్రీనివాసనగర్, సికింద్రాబాద్‌లోని దాతలే నడుంబిగించారు. శ్రీనివాసనగర్కాలనీలోనివసించే అప్పటి కేంద్రప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ఆలయం కోసం చేసిన కృషి అనిర్వచనీయం. ఇప్పుడు ఆలయాన్ని పూర్తి స్థాయిలో పునర్మించాలని సంకల్పించాం. అందుకు కంచి పీఠాథిపతి శ్రీ విజయేంద్ర మహాస్వామి, పుష్పగిరి పీఠాథిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి వారు స్వయంగా వచ్చి ఇచ్చిన
ఆశీర్వాదాలే కారణం. వారి ఆశీర్వాదబలం ఫలితంగా, ఆలయ పునర్మిర్మాణంలో భక్తులు సహకరిస్తున్నారు. అందరి సహకారంతో ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామ’ని ఆలయ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ వెల్లడించారు. ఆలయ పునర్ నిర్మాణానికి విరాళాలు ఇస్తున్న భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఆలయ ఈఓ కే.రాజేష్‌కుమార్ చెప్పారు. పాలకమండలి సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. భక్తులసహకారం, ప్రభుత్వ ప్రోత్సాహం, పీఠాథిపతులు-వేదపండితుల ఆశీస్సులతో ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.