Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర అప్పులు 8 లక్షల 30 వేల కోట్ల రూపాయలు

-పార్లమెంట్లో చెప్పింది ఒకటైతే… సాక్షి దినపత్రికలో రాసింది మరొకటి
-రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ఢిల్లీలో ఎక్కడైనా చర్చకు సిద్ధమే
-గత ప్రభుత్వం ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్నట్లు పనిచేస్తే… ప్రస్తుత ప్రభుత్వం అమరావతి , పోలవరం సర్వనాశనం చేసింది
-వరద బాధిత ప్రాంతాలలో 2014 నాటి స్ఫూర్తి ఏది జగన్మోహన్ రెడ్డి?
-బడులను మూసేసి… బార్లను తెరుస్తున్నారు
-బార్లను తెరిస్తే తెరుచుకోండి కానీ బడులను మాత్రం మూసేయకండి
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అన్నీ కలుపుకొని ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఏపీ అప్పుల గురించి పార్లమెంట్లో చెప్పింది ఒకటైతే, సాక్షి దినపత్రిక రాసింది మరొకటి అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలు మూడు లక్షల 98 వేల కోట్ల రూపాయలను పేర్కొనడం జరిగిందని, అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పొందిన రుణాల గురించి ప్రస్తావించలేదని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మార్చి 28వ తేదీ తాను ప్రధానమంత్రికి రాసిన లేఖలో పొందుపరిచిన… స్టేట్ పబ్లిక్ డేట్ ప్రకారం, 2022 , 23వ ఆర్థిక వార్షిక సంవత్సర, ప్రభుత్వ బడ్జెట్ వ్యాల్యూమ్ అరు, కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 4 లక్షల 13 వేల కోట్ల రూపాయలని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మూడు లక్షల 98 వేల కోట్లుగా పార్లమెంటులో పేర్కొన్న దానికి, గత ఏడాది అప్పులు చేసి కూడా లెక్కలు చూపించకుండ ఉన్న మొత్తం అప్పులు నాలుగు లక్షల 13వేల కోట్ల రూపాయలని వెల్లడించారు. ఇక కార్పొరేషన్ పేరిట చేసిన అప్పులు 1 లక్ష 38 వేల కోట్ల రూపాయలని, ఇది కాక ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరిట పదివేల కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందిందన్నారు. ప్రభుత్వం నాన్ గ్యారెంటీ తో, ఇతర కార్పొరేషన్లు పొందిన అప్పు 87 వేల కోట్ల రూపాయలుగా రఘురామకృష్ణం రాజు వివరించారు.. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం లక్ష 50వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించవలసి ఉన్నది అన్నారు. గత ఏడాది మార్చి నాటికి 7 లక్షల 98 వేల కోట్ల పైచిలుకు అప్పులుంటే, ఇటీవల 38 వేల కోట్ల రూపాయలను అప్పులుగా ఎత్తారని గుర్తు చేశారు. ఇందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు మద్యం బాండ్ల రూపంలో సేకరిస్తే, 30 వేల కోట్ల రూపాయలు ఆర్బిఐ నుంచి రుణంగా పొందారన్నారు.

అప్పుచేసి పప్పుకూడు సినిమాలో సి ఎస్ ఆర్ తరహాలో తమ ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉన్నదని అపహాస్యం చేశారు. అప్పుల గురించి దుష్ట చతుష్టయం, దత్త పుత్రుడు, రఘురామకృష్ణం రాజు చెప్పేది అంతా తప్పని వాలంటీర్ల కరపత్రం సాక్షి దినపత్రిక ను పట్టుకొని, వాలంటీర్లు చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధమని అన్నారు. దుష్ట చతుష్యం అలాగ, ఇలాగా అంటున్నారని వారు చెప్పేది అంతా తప్పు బూతు అని, రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి ఢిల్లీలో చర్చకు ఎక్కడైనా తాను సిద్ధమేనని, ఎవరు వస్తారో రావాలని రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు.

బ్యాంకర్లు, సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రిపై చర్యలు తీసుకోవాలి
కార్పొరేషన్ల పేరిట అప్పులు చేయడం తప్పని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆర్బిఐ ఇప్పటికే ఆ విషయాన్ని తన ఉత్తర్వులలో పేర్కొన్నదని గుర్తు చేశారు. ఆర్బిఐ మాస్టర్ సర్కులర్ లో ఈ విషయాన్ని స్పష్టం చేసిందని రఘురామ కృష్ణంరాజు, ప్రధానమంత్రి కి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఆర్.బి.ఐ నిబంధనలను ఉల్లంఘించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులకు సహకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పటి చైర్మన్ లను, అంతిమంగా లబ్ధిదారుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరారు. రాజ్యాంగంలోని 293(3) అధికరణలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్న విషయం బ్యాంకర్లకు తెలియదా? అంటూ ప్రశ్నించారు.

పోలవరంలో ఎలా పోగు చేసుకోవాలని చూస్తున్నారు
గత రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం నిర్మాణమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తే, ప్రస్తుత తమ ప్రభుత్వ పెద్దలు మాత్రం పోలవరంలో ఎలా పోగు చేసుకోవాలో చూస్తున్నారని రఘురామకృష్ణం రాజు విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టర్ మార్చి, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కాంట్రాక్టు పనులను కట్టబెట్టేందుకు రివర్స్ టెండర్ కు వెళ్లిందన్నారు. అప్పటి వరకు శరవేగంగా పోలవరం పనులను చేపడుతున్న కాంట్రాక్టర్ ను కాదని, రివర్స్ టెండర్ ద్వారా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కాంట్రాక్టు పనులు అప్పగించి నప్పటికీ, అతనితో పనులలో సమన్వయం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఐఐటి తన నివేదికలో పేర్కొన్నదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ దినపత్రిక నేడు కథనంగా ప్రచురించిందని, ఆ కథనంలోని విషయాలన్నీ అక్షర సత్యాలేనని పేర్కొన్నారు. విశాఖ ను రాజధానిగా ప్రకటించడానికి ఎవ్వరూ ఆపలేరని ముఖ్యమంత్రి సన్నిహితుడైన రెడ్డి పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తుందని, కోర్టు ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును కొట్టేసిందని గుర్తు చేశారు. అయినా ఏమిటి బాధ్యతారాహిత్యం అంటూ మండిపడ్డారు. అమరావతి రైతులను భయపెట్టే ప్రయత్నం చేయకుండా, గాయ పడిన హృదయాలను, మరింత గాయపరచకుండా, ఎప్పుడు వైజాగ్ కు వెళ్దామని కాకుండా, అమరావతి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని మార్చాలంటే పార్లమెంటుకు బిల్లు వెళ్ళవలసిందేనని, అమరావతి రాష్ట్ర రాజధానిగా భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.

బడిని గుడిని ప్రేమించేవారు మనకు ఓటు వేయరు
రాష్ట్రంలో బడిని గుడిని ప్రేమించే వారు ఎవరు రానున్న ఎన్నికలలో మనకు ఓటు వేయరని రఘురామకృష్ణం రాజు అన్నారు. బడిని గుడిని ప్రేమించని వారంటూ ఎవ్వరు ఉండరని పేర్కొన్నారు. రాష్ట్రంలో బడులను మూసివేసి, బార్లను తెరుస్తున్నారని అన్నారు. ఇప్పటికే 875 బార్ల ప్రారంభానికి అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, 8000 బడులను విలీన ప్రక్రియ పేరిట మూసివేసిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బడులను ప్రేమించేవారు అధికారంలోకి వస్తారని, వారు తిరిగి ఆ బడులను ప్రారంభిస్తారని అన్నారు. తరగతుల విలీనం అంటే బడుల విలీనమా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, కేంద్ర ప్రభుత్వం చెప్పిందేమిటి??, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుల మూసివేతను ప్రశ్నించకూడదని విద్యాశాఖ మంత్రి సత్తిబాబు అంటున్నారని, ఎందుకు ప్రశ్నించకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు బడులను విలీనం చేసినట్లే, రేపు ఆంధ్ర యూనివర్సిటీ, నన్నయ్య యూనివర్సిటీలను కలిపేశామంటారని ఎద్దేవా చేశారు.

జగనన్న కాలనీలన్నీ జల కళను సంతరించుకున్నాయి
కోస్తాంధ్రలో జగనన్న కాలనీలన్నీ జలకళ సంతరించుకున్నాయని, జగనన్న కాలనీల నిర్మిస్తామని చెప్పిన ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి, ప్రతి ఒక్క అర్హుడి కి ఇల్లు ఇస్తామని చెప్పారని, కానీ ఇళ్ళ నిర్మాణం ఎక్కడ పునాదులు దాటి పైకి లేవ లేదన్నారు. 16 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లను, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటలే తప్పితే… చేతల్లో చూపించడం లేదని, చేతల్లో చూపించేలా సద్బుద్ధిని పాలకులకు భగవంతుడు ప్రసాదించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

బ్రహ్మానందంలా… జగన్మోహన్ రెడ్డిది టీవీ నవ్వు
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరదలో పరదాలు కట్టుకోవడం ఏమిటో నని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. సిగ్గు లేకుండా దారి పొడవునా పరదాలను కట్టుకున్నారని విమర్శించారు. ఇక వరద బాధితులను పరామర్శించే సమయంలో ఆ ఒక్కటి అడగకు చిత్రంలో బ్రహ్మానందం లాగా జగన్మోహన్ రెడ్డి ఒక టీవీ నవ్వు పిసిరారని అపహస్యం చేశారు. పరదాలను దాటుకొని ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరూ వెళ్లలేదని, ఒక బాలుడు వెళ్లి పెన్ను అడిగితే, ఇచ్చిన దానికి 20 నిమిషాల పాటు సాక్షి ఛానల్ లో స్క్రోలింగ్ వేసుకున్నారని ఎద్దేవా చేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి, అధికారులను, బాధితులను పిలిచి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఐదు రోజుల క్రితమే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వరద బాధితులను పరామర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 2014లో వరద బాధితులను పరామర్శించేందుకు కారు దిగి పరిగెత్తిన, పొలాల్లోకి నడుచుకుంటూ వెళ్లిన స్ఫూర్తి, ఇప్పుడు వరద బాధితులను పరామర్శించడంలో ఏమయిందో చెప్పాలని ప్రశ్నించారు.

బాబు, పవన్ లకు మానవత్వం ఉంది… నువ్వు ఒక రాక్షసుడివి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మానవత్వం ఉన్నదని, అందుకే తనకు ఎదురైన కష్టానికి స్పందించి, ఓదార్పు మాటలు మాట్లాడారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తాను ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, పార్టీలో ఉన్న తనని ఏనాడైనా ఏమి జరిగిందని ఒక్కసారి అయినా అడిగావా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. నువ్వు రాక్షసుడివని, నీ పద్ధతి అంతేనంటూ విమర్శించారు. ఇక నీ పేటీఎం బ్యాచ్ కుక్కలు సోషల్ మీడియాలో ఇష్టా రీతిలో కూతలు కూస్తున్నారని విరుచుకుపడ్డారు. తాను చంద్రబాబు గురించి మంచి మాట్లాడితే ఆయనకు మద్దతిస్తున్నానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తనకు జరిగిన అన్యాయంపై స్పందించిన ఆయన పట్ల, ఆలస్యమైన స్పందించిన పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు.

కర్ణాటక పోలీసులకు జరిగింది నిజమైన యాక్సిడెంటేనా?
రాష్ట్రానికి ఒక గంజాయి కేసు విచారణ నిమిత్తం విచ్చేసిన కర్ణాటక పోలీసులకు జరిగిన ప్రమాదం నిజంగా జరిగిందేనా?, లేకపోతే ఈ ప్రమాదం వెనుక ఎవరైనా కుట్ర చేశారా ?? అన్న అనుమానాలు లేకపోలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలోని కొంతమంది నాయకులకు వాహన ప్రయాణ గండం ఉన్నదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రయాణాలు చేయవద్దని, అవసరమైన మేరకు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలన్నారు. అలాగే కొన్ని కేసులలో సాక్షులుగా ఉన్నవారికి గుండెపోటు వచ్చి మరణించే ప్రమాదం లేకపోలేదు అన్నారు. ఆహారంలో ఏదో మందు కలిపితే, వారు సాధారణంగానే గుండెపోటు వచ్చినట్లు మరణించే అవకాశాలున్నట్లు తెలిసిందని చెప్పారు. సాక్షులకు భోజన ప్రమాద హెచ్చరికలు కూడా ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

LEAVE A RESPONSE