• విద్యుత్ రంగంలో సాధించిన అభివృద్ధికి అవార్డులే నిదర్శనం
• విద్యుత్ సంస్థల విజయాల్లో ఉద్యోగులు, సిబ్బందిదే కీలకపాత్ర.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
• ప్రతికూల పరిస్థితుల్లో విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది సేవలు ప్రశంసనీయం
• వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతికి, జీడీపీ వృద్ధిరేటుకు విద్యుత్ రంగం కీలకం
• ప్రతి రంగం అభివృద్ధికి ఇంధనశాఖ కారణం
• వినియోగదారుల శ్రేయస్సు, విద్యుత్ సంస్థల బలోపేతం కోసం మరింత కృషి
• వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటల నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా
• పంప్డ్ విద్యుత్ స్టోరేజ్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి
• జగనన్న కాలనీల్లో విద్యుదీకరణకు రూ.3,500 కోట్లు ఖర్చు
• విద్యుత్ రంగ ప్రగతిపై ఆధారపడిన దేశ, రాష్ట్ర పురోభివృద్ధి
ఏపీ పవర్ యుటిలిటీస్ డైరీ-2023 ఆవిష్కరణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 3వ వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.
ప్రతి రంగం అభివృద్ధికి ఇంధన శాఖే కారణమని, విద్యుత్ రంగానికి వస్తున్న అవార్డులు, అభివృద్ధే తమ విజయాలని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందని ఆయన అన్నారు. బుధవారం విజయవాడ బందర్ రోడ్డులోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ పవర్ యుటిలిటీస్ డైరీ -2023, ఏపీ ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో, డిస్కమ్ లు, నెడ్ క్యాప్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, ఏపీసీడ్కోలకు సంబంధించిన డైరీ, క్యాలెండర్ ల ఆవిష్కరణ మరియు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 3వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ రంగ ఆవశ్యకత, జీడీపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారం సంబంధిత విషయాలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతికి, జీడీపీకి ఆర్థికంగా దోహదపడేది విద్యుత్ రంగం అన్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యుత్ సంస్థలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు అత్యంత నాణ్యమైన, చౌకైన, అంతరాయం లేని విద్యుత్ ను అందిస్తోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటల నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 24×7 నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా పథకం విజయవంతం అయిందన్నారు. వ్యవసాయ దిగుబడులు పెరిగేందుకు, తద్వారా రైతుల ఆదాయం పెరిగేందుకు ఉచిత విద్యుత్ దోహదడపడుతుందన్నారు. 66 వేల మంది ఆక్వా రైతులకు యూనిట్ కు కేవలం రూ.1.50కే విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. 18,65,000 మంది ఎస్సీ, ఎస్టీ లకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిశీలించి వారికి త్వరగా కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డిస్కమ్ లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
భారతదేశంలోనే ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం తమ ప్రభుత్వం జగనన్న కాలనీల ద్వారా 31 లక్షల పై చిలుకు ఇళ్లపట్టాలు ఇచ్చిందన్నారు. ఇప్పటికే 22 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా విద్యుదీకరణకు రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వినియోగదారుల శ్రేయస్సు కోసం, విద్యుత్ సంస్థల బలోపేతం కోసం ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే కృష్ణపట్నం ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని వచ్చే మార్చిలో ఆర్టీపీఎస్ 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తామన్నారు.
విద్యుత్ సంస్థల విజయాల్లో ఉద్యోగులు, సిబ్బందిదే కీలకపాత్ర: విద్యుత్ సమర్థ వినియోగంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మూడు ఇనెర్షియా అవార్డులు పొందడం గర్వంగా ఉందన్నారు. తద్వారా రాష్ట్రానికి గౌరవం పెరిగిందన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగంపై కొందరు చేస్తున్న విమర్శలకు జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న అవార్డులే సమాధానమన్నారు. అవార్డులు, అభివృద్ధే తమ విజయాలని ఆనందం వ్యక్తం చేశారు. అంకితభావంతో, సేవాతత్పరతతో పనిచేసేది విద్యుత్ శాఖ ఉద్యోగులు అని ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యోగులు, సిబ్బంది అందించిన అత్యుత్తమ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. విద్యుత్ సంస్థల అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భారతదేశంలో ట్రాన్స్ కో ఏపీలో బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు. పంప్డ్ విద్యుత్ స్టోరేజ్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి అని వెల్లడించారు. విద్యుత్ శాఖ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా రాష్ట్ర విద్యుత్ శాఖ మరింత ధీటుగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి, రాష్ట్ర ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందడానికి విద్యుత్ రంగం వెన్నెముకలా నిలుస్తుందన్నారు. ఎక్కడ గుర్తింపు ఉంటుందో.. అక్కడ విమర్శలు కూడా వస్తుంటాయని, అయితే ఆ విమర్శలను సైతం విడనాడి విద్యుత్ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలన్నారు. నాణ్యమైన, ఉత్తమ సేవలను త్వరితగతిన అందించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తిలో ఎంతో ప్రగతిని సాధించామని తెలిపారు. విద్యుత్ రంగం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. 11 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి రాష్ట్ర విద్యుత్ శాఖ పెరిగిందన్నారు. కృష్ణపట్నం ప్రాజెక్టుని ఇఫ్పటికే జాతికి అంకితం చేశామని, అలాగే విజయవాడలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మన విద్యుత్ సంస్థలు వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా సరసమైన ధరకే నాణ్యమైన సేవలు అందించి ప్రగతి పథంలో దూసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ ఉద్యోగ శ్రేణులకు విజయానంద్ పిలపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (ఏపీసీపీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జె. పద్మ జనార్థన రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ మూడేళ్ల ప్రగతిని వివరించారు. నిరంతరం 24×7 వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంస్థ తీసుకున్న చర్యలతో ఇప్పటికే రోజుకి 23.54 గంటల నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. 30 సంవత్సరాలు దాటిన సబ్ స్టేషన్ లలో ఏజెన్సీలను ఏర్పాటుచేసి మరమ్మత్తులు చేస్తున్నామన్నారు. ప్రజలు, ఉద్యోగులు భద్రత కోసం పోల్ టు పోల్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. కాలానుగుణంగా మారుతున్న నూతన టెక్నాలజీని ఎప్పటికప్పుడు వినియోగిస్తున్నామన్నారు. విద్యుత్ శాఖలో క్రింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకూ నూతన టెక్నాలజీలపై అవగాహన, శిక్షణ నిరంతరం ఇస్తున్నామని తెలిపారు. జగనన్న కాలనీల్లో ఇళ్లకు త్వరితగతిన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్ కో సీఎండీ & ఏపీ జెన్ కో ఎండీ బి. శ్రీధర్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ & ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కె. సంతోష్ రావు, ఏపీ ట్రాన్స్ కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బి. మల్లారెడ్డి, న్యూ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. రమణా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో ఎ. చంద్రశేఖర్ రెడ్డి, విద్యుత్ శాఖ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో ప్రదర్శించిన నాటికలు, ముఖ్యంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన సిద్ధార్థ మహిళా కళాశాల భవ్య బృందం ప్రదర్శించిన చెక్కభజన, కూచిపూడి నృత్యాలు, బుర్రకథ, విద్యుత్ రంగ విజయాలపై పాడిన పాటలు ఆద్యంతం అందరినీ అలరించాయి.