October 8, 2026

వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి రాష్ట్రం సిద్ధం

  • రాష్ట్ర, కేంద్ర వాటాలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం
  • లబ్ధిదారుల ఎంపికపై కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు
  • చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకం
  • రైతుకు నచ్చిన కంపెనీ నుంచి వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసే వెసులుబాటు
  • సబ్సిడీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
  • ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం.. బీసీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ
  • ఎఫ్‌పీఓలను కస్టమ్ హైరింగ్ సెంటర్లుగా వినియోగించే అవకాశాలపై అధ్యయనం చేయాలి
  • రైతుల అభిప్రాయాలతో యాంత్రీకరణ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలి
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పక్కన పెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2025-26 సంవత్సరం నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి అమలు చేస్తున్నామని చెప్పారు. 2025-26 సంవత్సరానికి పథకం కోసం రూ.71 కోట్లు కేటాయించగా, రూ.63 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులకు మరింత విస్తృతంగా యాంత్రీకరణ ప్రయోజనాలు అందించేందుకు 2026-27 సంవత్సరానికి రూ.147.99 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర, కేంద్ర వాటాలతో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టామని, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేయాల్సిన మార్గదర్శకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టి, రైతులకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతుకు నచ్చిన కంపెనీ నుంచి పరికరం కొనుగోలు చేసే అవకాశం…

రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాన్ని తమకు నచ్చిన ఎంప్యానెల్ చేసిన కంపెనీ వద్ద కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం పథకం ద్వారా లబ్ధి పొందే రైతు ఒక నిర్దిష్ట సంస్థ లేదా ఎంపిక చేసిన సరఫరాదారుడి వద్ద నుంచే పరికరం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లేకుండా, రైతుకు మరింత స్వేచ్ఛ ఉండే విధంగా విధానాన్ని రూపొందించాలని తెలిపారు.

సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేయనుండటం వల్ల రైతులు కూడా వ్యవసాయ పరికరం కొనుగోలు చేసే ముందు వివిధ కంపెనీల ధరలను, నాణ్యతను పరిశీలించి, తక్కువ ధరకు మంచి నాణ్యత కలిగిన పరికరం ఎక్కడ లభిస్తే అక్కడే కొనుగోలు చేసుకోవాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సబ్సిడీ సద్వినియోగం కావడంతో పాటు, ఎక్కువ మంది రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు.

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం, బీసీ మరియు ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ అందుతుందని మంత్రి తెలిపారు. సబ్సిడీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో పాటు, పథకంలో పారదర్శకత పెరుగుతుందని మంత్రి అన్నారు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు అందించేందుకు ప్రస్తుతం 37 రకాల వ్యవసాయ పరికరాలను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో పథకం పరిధిలో 19 రకాల పరికరాలు మాత్రమే ఉండేవని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పరికరాల సంఖ్యను 37 రకాలకు పెంచినట్లు చెప్పారు.

ఇందులో పవర్ టిల్లర్, బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టిల్లర్/వీడర్, డిస్క్ ప్లౌ, కల్టివేటర్, లెవలింగ్ బ్లేడ్, రోటావేటర్, రోటో-పుడ్లర్, రివర్సిబుల్ ఎంబీ ప్లౌ, సబ్ సాయిలర్, బండ్ ఫార్మర్, సీడ్-కం-ఫెర్టిలైజర్ డ్రిల్, మల్టీ క్రాప్ ప్లాంటర్, రైజ్డ్ బెడ్ ప్లాంటర్, పోస్ట్ హోల్ డిగ్గర్, ప్లాస్టిక్ మల్చ్ లేయింగ్ మెషిన్, ఫెర్టిలైజర్ బ్రాడ్‌కాస్టర్, రిడ్జ్ ఫరో ప్లాంటర్, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్లాషర్, పవర్ వీడర్, మాన్యువల్ నాప్‌సాక్ స్ప్రేయర్, పవర్ నాప్‌సాక్ స్ప్రేయర్, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్, కిసాన్ డ్రోన్, కంబైన్ హార్వెస్టర్, మైజ్ కంబైన్ హార్వెస్టర్, మల్టీ క్రాప్ థ్రెషర్, విన్నోయింగ్ ఫ్యాన్, మైజ్ షెల్లర్, టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్స్, పసుపు బాయిలర్, పసుపు పాలిషర్, ప్యాడీ మొబైల్ డ్రైయర్, స్ట్రా బేలర్, రోటరీ ష్రెడర్, మల్చర్, రోటరీ స్ట్రా స్లాషర్, బ్రష్ కట్టర్ ఉన్నాయి.

రైతుల అవసరాలు, సాగు విధానాల్లో వస్తున్న మార్పులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని పథకం అమలు మధ్యలో కూడా రైతులకు ఉపయోగపడే కొత్త వ్యవసాయ పరికరాలను చేర్చుకునేలా విధానాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Total Visitors: 2,899,754