* 3న జరిగే మోదీ బహిరంగ సభకు రావాలంటూ రాష్ట్రంలోని రాష్ట్రవ్యాప్తంగా ఆహ్వానం
* 50 లక్షల ఆహ్వాన పత్రికలు అందించాలని బీజేపీ నిర్ణయం
* 10 లక్షల మంది సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు
* ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 10 వేల మంది జన సమీకరణ
* నభూతో నభవిష్యత్ అనేలా సభను సక్సెస్ చేసి కొత్త చరిత్ర స్రుష్టించాలని నిర్ణయం
* జన సమీకరణ, విరాళాల సేకరణ, కార్యక్రమాల నిర్వహణపై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రభారీల నియామకం
* పోలింగ్ బూత్ నుండి రాష్ట్రస్థాయి నేతల వరకు విరాళాలను సేకరించాలని నిర్ణయం
* ఎన్ఈసీ నిర్వహణలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతోనే విరాళాల సేకరణ
* అసెంబ్లీ ప్రభారీలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ భేటీ
* జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం
* ఎన్ఈసీ కార్యవర్గ సమావేశాల సన్నాహక ఏర్పాట్లపై రోజంతా బండి సంజయ్ సమీక్ష
* ప్రతి కమిటీతో ప్రత్యేక భేటీ అయిన బండి సంజయ్, ఎన్ఈసీ సన్నాహాక కమిటీ ఛైర్మన్ లక్ష్మణ్, ఇంఛార్జీ అరవింద్ మీనన్
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల (ఎన్ఈసీ) నేపథ్యంలో వచ్చేనెల 3న హైదరాబాద్ లో నిర్వహించబోయే బహిరంగ సభను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా పార్టీకి చెందిన అతిరథ మహారథులంతా ఈ బహిరంగ సభకు హాజరై దిశా నిర్దేశం చేయనున్న నేపథ్యంలో సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి నూతన చరిత్ర స్రుష్టించాలని నిర్ణయించారు. రాష్ట్రం నలుమూలల నుండి 10 లక్షల మందికిపైగా ప్రజలు బహిరంగ సభకు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
అందులో భాగంగా ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సన్నాహక కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె.లక్ష్మణ్, కమిటీ జాతీయ ఇంఛార్జీ అరవింద్ మీనన్ రోజంతా సమీక్షలు నిర్వహించారు. ఎన్ఈసీ నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలతో భేటీ అయ్యారు. ఆయా కమిటీలకు అప్పగించిన బాధ్యతల నిర్వహణ విషయంలో పురోగతిపై సమీక్షించారు. అనంతరం స్థానికేతర నాయకులతో నూతనంగా నియమించిన అసెంబ్లీ ప్రభారీ (ఇంఛార్జీ)లతో బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, అరవింద్ మీనన్, మధ్య ప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావు, రాష్ర ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాస్ (సంస్థాగత), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎన్ఈసీ సన్నాహక ఏర్పాట్లు, 3న జరిగే బహిరంగ సభకు జన సమీకరణ సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల ప్రభారీలు చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుతున్నారని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక ద్రుష్టి సారించిందని, అందులో భాగంగానే జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందులో భాగంగా వచ్చేనెల 3న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు 10 లక్షల మందికిపైగా ప్రజలు తరలివచ్చేలా చేసి తెలంగాణలో కొత్త చరిత్రను స్రుష్టిద్దామన్నారు. మరే పార్టీ ఈస్థాయిలో సభను సక్సెస్ చేయలేదనే విధంగా నభూతో నభవిష్యత్ అనేలా సభను విజయవంతం చేద్దామన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీసహా అతిరథ మహారథులంతా 3న జరిగే సభకు హాజరై తెలంగాణ ప్రజానీకానికి దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ఈ సమాచారాన్ని రాష్ట్రంలోని ప్రతి గడప గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి బహిరంగ సభకు సంబంధించి ఆహ్వాన పత్రికను అందజేయాలని కోరారు. అందుకోసం 50 లక్షల ఆహ్వాన పత్రికలను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి కనీసం 30 మంది చొప్పున, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సగటున 10 వేలకు తగ్గకుండా ప్రజలు సభకు హజరయ్యేలా చూడాలన్నారు. ఈనెల 22న అసెంబ్లీ ప్రభారీలంతా తమకు అప్పగించిన నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి స్థానిక నేతలతో సమావేశమై జన సమీకరణతోపాటు స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను సన్నద్ధం చేయాలని కోరారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఉండాలన్నదే పార్టీ నిర్ణయమని చెప్పిన బండి సంజయ్ అందులో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు విరాళాలు సేకరించాలని ఆదేశించారు. ఆయా విరాళాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు స్వీకరించవద్దని… పార్టీ రాష్ట్ర శాఖ పేరిట ఉన్న ఖాతాకు మాత్రమే డిజిటిల్ పేమెంట్ల బదలాయించాలని స్పష్టం చేశారు. వీటితోపాటు ఈనెలలో నిర్వహించబోయే యోగా దివస్, జాతీయ ఎమర్జెన్సీ డే వంటి కార్యక్రమాల సందర్బంగా చేపట్టాల్సిన కార్యాచరణపైనా బండి సంజయ్ తోపాటు లక్ష్మణ్, అరవింద్ మీనన్ ఆయా నేతలకు దిశానిర్దేశం చేశారు.