– కార్మికుల హక్కులు
– ప్రయోజనాలు బలోపేతం
– పారిశ్రామిక శాంతి, పెట్టుబడులకు అనువైన వాతావరణం
– దేశంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమానికి ఆదర్శ రాష్ట్రంగా నిలవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం
– కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
విజయవాడ: హోటల్ ఆయత్ లో కొత్త లేబర్ కోడ్స్ అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ , కార్మిక శాఖ లేబర్ కమిషనర్ & సెక్రటరీ శేషగిరి బాబు తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం, పరిశ్రమలు–ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, మరియు కేంద్ర లేబర్ కోడ్స్ అమలుపై కీలక విషయాలను వెల్లడించారు.
ఈ సందర్బంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని, కేంద్రం తీసుకువచ్చిన సామాజిక భద్రత కోడ్ 2020, పారిశ్రామిక వివాదాల కోడ్, వేతనాల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ & వర్కింగ్ కండిషన్స్ కోడ్ అమలులో ముందంజలో ఉందన్నారు. అసంఘటిత రంగం, గిగ్–ప్లాట్‌ఫామ్ వర్కర్లను సామాజిక భద్రత కిందకు తీసుకురావడం ద్వారా లక్షలాది కార్మికులకు రక్షణ లభిస్తుందని చెప్పారు. “ప్రతి కార్మికుడికి సమాన వేతనం, సకాలంలో వేతనం, మరియు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
మహిళా ఉద్యోగుల కోసం మాతృత్వ సెలవులు, వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాలు, రాత్రిపూట పని అనుమతులు వంటి సంస్కరణలు మహిళల సాధికారతకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. పరిశ్రమలతో సమన్వయం పెంచి, ఉద్యోగావకాశాలు, పెట్టుబడులు పెరిగేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. లేబర్ కమిషనర్ & సెక్రటరీ శేషగిరి బాబు మాట్లాడుతూ, కార్మికుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సోషల్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి సంస్థలో హెల్త్ చెకప్‌లు, సేఫ్టీ కమిటీలు, అపాయింట్మెంట్ లెటర్లు తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు. వలస కార్మికుల కోసం జర్నీ అలవెన్స్, పిడిఎస్ పోర్టబిలిటీ, నిర్మాణ కార్మికుల ప్రయోజనాల పోర్టబిలిటీ అమలులో ఉన్నాయని చెప్పారు. డిజిటల్ మీడియా వర్కర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఈ కొత్త కోడ్ల కింద రక్షణ పొందుతున్నారని వివరించారు. ఉద్యోగాల తొలగింపులో రీ-స్కిల్లింగ్ ఫండ్ ద్వారా కార్మికులకు తక్షణ సహాయం అందించే విధానం అమల్లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అడిషనల్ సెక్రెటరీ గంధం చంద్రుడు, జెసిఎల్ లక్ష్మీనారాయణ, ఆశారాణి, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ మోహన్ రావు , కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.


