Suryaa.co.in

Andhra Pradesh

బాబు వాహనంపై వైసీపీ నేతల రాళ్ల దాడి

– బాబుకు రక్షణగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు
– గాయపడ్డ ఎన్‌ఎస్‌జీ కమాండో
– మూడు కుట్లతో ఆసుపత్రిలో చికిత్స
– బాబు పర్యటనకు నిరసనగా చొక్కా విప్పిన మంత్రి సురేష్
– బాబు కాన్వాయ్‌కు అడ్డుపడ్డ వైసీపీ
– మంత్రి క్యాంపు ఆఫీసు వద్ద ఉద్రిక్తం
– పోలీసుల వైఫల్యమేనన్న టీడీపీ
– పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటన్న కన్నా లక్ష్మీనారాయణ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలం సురేష్ నాయకత్వంలో వైసీపీ కార్యకర్తలు బాబు పర్యటనను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను, టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ఆ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మంత్రి సురేష్ తన క్యాంపు ఆఫీసు వద్ద, కార్యకర్తలతో కలసి చొక్కా విప్పి మరీ బాబుకు నిరసన వ్యక్తం చేశారు.

దానితో ఆగని వైసీపీ శ్రేణులు బాబుపై రాళ్ల దాడి చేశారు. దానితో అప్రమత్తమైన ఎన్‌ఎస్‌జీ కమాండోలు, ఆయనకు రక్షణగా నిలిచారు. ఆ క్రమంలో ఎన్‌ఎస్‌జీ హెడ్ సంతోష్‌కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించిన ఆయనకు మూడు కట్టు పడ్డాయి. తర్వాత ఆయనను చంద్రబాబు పరామర్శించారు. ఎర్రగొండపాలెంలో జోరు వర్షం కురుస్తున్నప్పటికీ, బాబు పర్యటన ఆగలేదు. జనం కూడా రోడ్లపై అలాగే నిల్చోవడం కనిపించింది.

కాగా, సీఎం-ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటన తెలిసి కూడా, పోలీసులు మంత్రి సురేష్‌ను నిరసనకు అనుమతించడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ పర్యటనకు వస్తే.. టీడీపీ నేతలను గృహనిర్బంధం చేసే పోలీసులు, విపక్ష నేత పర్యటించినప్పుడు, వైసీపీ నేతలను ఎందుకు గృహనిర్బంధం చేయలేదని నిలదీశారు. కాగా తాజా సంఘటనపై పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పోలీసులకు సెల్‌ఫోన్‌లో సమాచారం ఇచ్చినా స్పందించలేదని టీడీపీ నేతలు విమర్శించారు.

ఇంత రౌడీయిజమా?: కన్నా
తాజా ఘటనపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. వారికి అంత ఇష్టం ఉంటే ఖాకీ డ్రస్సు విప్పి, వైసీపీ కండువా వేసుకోమనండి. నేను దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా. మంత్రిగా, ఎమ్మెల్యేగా చేశా. విపక్షంలో కూడా ఉన్నా. కానీ ఇలాంటి రౌడీయిజం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈరోజు బాబుపై జరిగిన దాడికి పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలి. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగినా పోలీసులు మౌనంగా ఉన్నారు. ఇప్పుడూ ప్రేక్షకపాత్ర పోషించారు. ఇది సిగ్గుచేటు. దీనికి వైసీపీ మూల్యం చెల్లించుకుంటుంద’ని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. బాబుపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు మౌనంగా ఉంటే.. రేపు మీ వంతు కూడా వస్తే, సమాజాన్ని ఎవరూ కాపాడలేరని కన్నా వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE