– ఏపీ సీఎస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
చంద్రబాబు లేఖ సారాంశం ఇదీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ని రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని తిరిగి ప్రారంభిస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని ప్రకటించారు.అయితే ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడిచినా హామీ నెరవేరలేదని ఉద్యోగులు నిరసనల బాట పట్టారు. శాంతియుత నిరసనలు ఉద్యోగులకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు.సిఎం జగన్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చని కారణంగానే ఉద్యోగులు నిరసనల బాట పట్టాల్సి వచ్చింది.
ఉద్యోగులు 1 సెప్టెంబర్, 2022న విజయవాడలో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఉద్యోగులపై బైండోవర్ కేసులు, నోటీసులు, పోలీస్ స్టేషన్ కు పిలిపించడం వంటి రకరకాల చర్యలతో వారిని వేధింపులకు గురిచేసింది.
ఉద్యోగులు తమ శాంతియుత నిరసనను సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినప్పటికీ పోలీసుల బెదిరింపులు, వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఉద్యోగులపై గతంలో ఎప్పుడూ ఈ తరహా వేధింపులకు పాల్పడిన సందర్భం లేదు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులపై వేధింపులు, బెదిరింపులను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి.