– వైసిపి ప్రభుత్వ బాటలోనే టిడిపి
– అప్పులు కాదు, కేంద్రం నుండి నిధులు సాధించండి
– మరో దశ భూ సమీకరణ ఆపండి
– అమరావతి రైతు, కూలీల గోడు వినండి
– గుంటూరు జిల్లాకు కూటమి నేతలు ఎక్కువ, పని తక్కువ
– అవినీతిలో మునిగి తేలుతున్న పాలకులు
– విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లు, రాజధాని హామీల అమలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కండి
– భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) గుంటూరు జిల్లా విస్తృత సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, జిల్లా కార్యదర్శి వై.నేతాజీ
గుంటూరు: జిల్లాలో కూటమి కీలక ప్రజా ప్రతినిధులు, మంత్రులు లోకేష్, పెమ్మసాని, మనోహర్ తదితరులు ఉన్నా జిల్లాలో అభివృద్ధి బహు స్వల్పం. నేతలు ఎక్కువ, మాటలెక్కువ, పని తక్కువగా ఉంది. అభివృద్ధి స్వల్పంగానే ఉంది. ముఖ్యమంత్రి నివాసం, రాజధాని అమరావతి జిల్లాలోనే ఉన్నా, జిల్లా ప్రజల స్థితిగతులు ఈ పాలనలోను ఏమాత్రం మెరుగుదల కాలేదు.
అమరావతి నిర్మాణానికి భూములు తీసుకుని పదకొండేళ్లు గడిచిపోయినా, రైతు, కూలీలకు, ప్రజలకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇప్పటివరకు కనీసం ప్లాట్లు కూడా చూపించలేదు, రుణాలు ఇచ్చే దిక్కులేదు.
నాలుగు నెలల జాప్యం తర్వాత కూడా కొందరికే కౌలు జమ చేశారు, ఉచిత విద్యా, వైద్యం హామీ గాలికి వొదిలారు. కొత్త పరిశ్రమలు, సంస్థలు లేవు, ఉపాధి లేదు. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న రాజధాని, జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. రాజధానికి తొలి దశలో తీసుకున్న 34 వేల ఎకరాల అభివృద్ధికే దిక్కులేదు. మరో 44 వేల ఎకరాల భూ సమీకరణ ప్రకటనలతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
భూదాహమే తప్ప, రైతుల, ప్రజల గోడు పాలకులకు పట్టలేదు. లాభమే పరమావధిగా భావించే సింగపూర్ బడా కంపెనీలను మళ్లీ రాజధానిలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు శోచనీయం. సింగపూర్ చుట్టూ తిరగటం కాదు, కేంద్రం, మోడీపై ఒత్తిడి తీసుకురండి, విభజన చట్ట ప్రకారం రాజధానికి నిధులు సాధించండి
ప్రపంచ బ్యాంకు ఇతర అప్పులు కాదు, హక్కు ప్రకారం నిధులకై ఒత్తిడి తెండి. మోడీ రాజధానికి రెండుసార్లు వచ్చినా, చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి, ఉపన్యాసాలు తప్ప ఒరిగిందేమీ లేదు. బడా కంపెనీలకు భూములు కట్టబెట్టడం తప్ప, పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లకు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు, ఆగిపోయిన ఇళ్లు పూర్తి చేయలేదు, పూర్తయిన ఇళ్ళు కేటాయించలేదు, సౌకర్యాలు కల్పించలేదు
వక్ఫ్ భూములు సైతం బడా సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గం. కేంద్రంలో కీలక బాధ్యతలలో ఉండి కూడా గుంటూరు ఫ్లైఓవర్ కు అవసరమైన నిధులు తేకుండా, బ్రిడ్జి సైజు తగ్గించడం గర్హనీయం. మిర్చి, బర్లి పొగాకు, పత్తి… ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, గుంటూరు ఛానల్ కు నిధులు లేవు, పనులు లేవు.
విద్యుత్ బిల్లులు కట్టలేక, ప్రభుత్వ సహాయం అందక స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి, ఉపాధి దెబ్బతిన్నది, కొత్త పరిశ్రమలు లేవు. ప్రైవేటు యూనివర్సిటీలపై మోజు తప్ప, నాగార్జున యూనివర్సిటీ అభివృద్ధిపై దృష్టి లేదు, కనీసం ప్రజా ప్రతినిధులు తొంగి కూడా చూడటం లేదు. గుంటూరులో మేయర్ పదవి దక్కించుకోవడంపై ఉన్న శ్రద్ధ , మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు మౌలిక సదుపాయాలపై లేదు.
గ్రేటర్ మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ లో పన్నుల పెంపే తప్ప, సదుపాయాలపై శ్రద్ధ లేదు. తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు నెలలు తరబడి ఆందోళన చేస్తున్నా పాలకులలో చలనం లేదు.
దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ లో ప్రమాదం జరిగి సంవత్సరాలు గడిచినా అందరికీ ఇంకా సహాయం అందలేదు. అవినీతికి అంతులేకుండా పోయింది, ప్రజా ప్రతినిధులు ఇసుక, మైనింగ్, మద్యం, బెల్ట్ షాపులు, భూ వివాదాల్లో, అవినీతిలో కూరుకు పోయారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు, అభివృద్ధిని విస్మరించారు
కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, భారాలు పెంచడమే తప్ప, సంక్షేమ పథకాల అమలు నామమాత్రంగా మిగిలింది. గత వైసిపి ప్రభుత్వ బాటలోనే టిడిపి నడుస్తోంది, ప్రజా ప్రతినిధులు అవినీతిలో పోటీపడుతున్నారు. ప్రజలను గాలికి వదిలేశారు. ఈ స్థితిలో విద్యుత్ భారాలు, ఆదానీ స్మార్ట్ మీటర్లు, ఇళ్ళు, పట్టాలు, హామీల అమలుకై ఉద్యమాలకు సిద్ధం కండి. పాలకులను నిలదీయండి. ప్రజలను కూడగట్టండి.
సమావేశంలో సిపిఎం జిల్లా నేతలు నళిని కాంత్, ఈమని అప్పారావు, భావన్నారాయణ, ఎం.రవి, బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.