• మహిళలకు అందిస్తున్న ‘ఉచిత బస్సు’ భారం కాదు బాధ్యత
• ఈ 6 రోజుల్లో 65 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు
• మరో రెండేళ్ళలోగా రాష్ట్రంలోని పల్లెవెలుగు బస్సులు సైతం ఏసీ బస్సులుగా మార్పు
• పథకం తీరుతెన్నులపై సద్విమర్శలకు ఆహ్వానం
• బస్సుల్లో సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలు ఏర్పాటు
• మహిళా ప్రయాణికుల భద్రత పరంగా రాజీ పడే ప్రసక్తే లేదు
• తిరుమల కు కూడా ఫ్రీబస్సుపై ఆలోచన చేస్తున్నాం
• ప్రభుత్వానికి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లు వంటి వారు
– రవాణా, యువజన మరియ క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
విజయవాడ: కూటమి ప్రభుత్వం మహిళామూర్తులకు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అందించిన మరో కానుక స్త్రీ శక్తి సూపర్ సక్సెస్ అయిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. స్త్రీ శక్తి పథకం సక్సెస్ సందర్భంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులతో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలు ఒక్కోక్కటి ఒక్కో విశిష్టత కలిగి ఉన్నాయని, వాటిలో మహిళామూర్తులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే స్త్రీ శక్తి పథకం విజయవంతం కావడం అభినందనీయమన్నారు.
ఉచిత బస్సు పథకం అమలుకు ముందు పక్క రాష్ట్రాల్లో పథకం అమలు తీరును అధ్యాయనం చేసిన తరువాతనే మన రాష్ట్రంలో పటిష్ఠంగా అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మహిళలకు ఉచిత బస్సు పథకమని ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నామని తెలిపారు. పథకం అమలు తీరులో చిన్న చిన్న లోటుపాట్లు సహజమని, ఒడిదుడుకులను తట్టుకుని సద్విమర్శలను పరినణలోకి తీసుకుని పథకంను విజయవంతం చేయడంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు.
స్త్రీ శక్తి పథకం అమలు ప్రభుత్వానికి భారం కాదని, బాధ్యత అని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నింటిలో స్త్రీ శక్తి పథకం టాప్ లో ఉంటుందన్నారు. ఈ ఆరు రోజుల్లో 65 లక్షల మందికి పైగా మహిళలు ఫ్రీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. ఈ మేరకు ఆర్టీసీకి ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుందన్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ఫ్రీ బస్సు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందించే యోచనలో ఉన్నామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతి బస్సులో సీసీ కెమెరాలు, కండెక్టర్ల కు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఆర్టీసీని బలోపేతం చేస్తాం. కూటమి ప్రభుత్వం త్వరలో 750 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురానుందని, మరో నాలుగేళ్లలో 2500కు పైగా నూతన బస్సులను కొనుగోలు చేయనున్నామని తెలిపారు. నూతనంగా కొనుగోలు చేసే బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులే అని వివరించారు. దాంతో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా పల్లె వెలుగు బస్సులు సైతం ఏసీ బస్సులే ఉంటాయని చెప్పారు.
కొండ(ఘాట్ రోడ్) ప్రాంతాల్లో సైతం ఫ్రీ బస్సు అమలు చేస్తున్నామని, రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, మరో వారం రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. తిరుమలకు కూడా ఫ్రీ బస్సు అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక వెసులుబాటును పొందాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.