– మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి: ఆహార తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్స్, ఫుడ్ కోర్టులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడారు. “సరైన పదార్థాలు వాడకపోవడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని హోటల్స్‌లో హానికర పదార్థాలు కలిపి ఆహారం తయారు చేస్తున్నారు. ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి,” అని అన్నారు.
ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించి, అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీలలో 51 రెస్టారెంట్లలో 44 రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఆహారాన్ని తయారుచేస్తున్నట్టు వెల్లడైందని తెలిపారు. వాటిలో అనేక లోపాలు గుర్తించారని, తగిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని సంస్థలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.