-
అబ్బాయ్ ఆదేశాలకు బాబాయ్ జెల్ల
-
గాదె మధుసూదన్‌రెడ్డిని పరుచూరు ఇన్చార్జిగా నియమించాలని జగన్ ఆదేశం
-
వెంటనే ఎన్నికల్లో ఓడిన బాలాజీని రంగంలోకి దింపిన సుబ్బారెడ్డి
-
కాపు కార్డుతో గాదెకు బాబాయ్ చెక్
-
ఆఘమేఘాలపై అమెరికా నుంచి వచ్చిన బాలాజీ
-
తాను ఇన్చార్జిగా ఉంటానని జగన్‌కు హామీ
-
మండల కమిటీల జాబితా ఇవ్వాలని జగన్ ఆదేశం
-
కొద్దిరోజులకే అమెరికా చెక్కేసిన బాలాజీ
-
తన తమ్ముడు పనిచేస్తాడని అమెరికా నుంచి సందేశం
-
బాపట్లపై ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కన్ను
-
జగన్‌ను ముంచేస్తున్న సజ్జల, సుబ్బారెడ్డి, తలశిల, అప్పిరెడ్డి కోటరీ
-
నియోజకవర్గ నేతల ఆగ్రహం
-
పులివెందుల అదృశ్యశక్తి పార్టీని నడిపిస్తున్నారన్న ప్రచారం
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘వైసీపీ అధినేత జగన్ ఎవరిమాట వినడు. తాను చెప్పిందే చేయాలని ఆదేశిస్తాడు. ఆయనకు ఎవరూ ఎదురుచెప్పే ధైర్యం పార్టీలో లేదు. ఆయనకు సలహా ఇచ్చే సాహసం కూడా ఎవరూ చేయరు. ఆయన ఒకమాట చెబితే ప్రభుత్వంలోనయినా, పార్టీలోనయినా జరిగిపోవాల్సిందే’’.. ఇదీ సొంత పార్టీలో- బయట జగన్ గురించి ఉన్న విపరీతమైన ప్రచారం. కానీ అంతలావు జగన్.. ఇప్పుడు కోటరీకి బందీ అయిన వైచిత్రి.
అబ్బాయ్ చెప్పినా బాబాయ్ బేఖాతరు చేసి, తన మాట నెగ్గించుకున్నారంటే ఎవరైనా న మ్ముతారా?.. నమ్మరు కదా?! బట్.. పరుచూరు నియోజకవర్గ ఇన్చార్జి విషయంలో అదే జరిగింది కాబట్టి. సో.. జగన్ గురించి బయట ఎంత బిల్డప్ ఉన్నప్పటికీ.. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, తలశిల రఘురామ్, అప్పిరెడ్డి కోటరీ చేతిలో బందీ అన్నది మరోసారి తేలిపోయింది.
పార్టీని మళ్లీ పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో జగన్, ఇటీవలి కాలంలో జిల్లాలపై దృష్టి సారించారు. అందులో భాగంగా బలహీన ంగా ఉన్న జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిల స్థానంలో బలమైన వారిని నియమించాలన్నది జగన్ లక్ష్యం. కానీ..పార్టీలో కోటరీగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, తలశిల రఘురామ్, అప్పిరెడ్డితోపాటు, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కలసి జగన్ ఆదేశాలు అమలుకాకుండా, ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు పార్టీలో వెల్లువెత్తుతోంది.
ఈ కోటరీ.. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొత్తవారు రాకుండా, తమ మాట జవదాటని నేతలనే నియమించేలా చక్రం తిప్పుతున్నారు. ఈ విషయంలో జగన్ వ్యక్తిగత కార్యదర్శి, ఈ కోటరీకి ఇతోధికంగా సాయపడుతున్నట్లు వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో, కాపు సామాజికవర్గానికి చెందిన ఎడం బాలాజీ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. నిజానికి అక్కడ ఇన్చార్జిగా ఉన్న ఆమంచికి సీటు ఇస్తే.. ఆయన తమకు ఏకు మేకు అవుతారని,పైగా ఇక ఆ నియోజకవర్గంపై తన పట్టు సడలిపోతుందని భావించిన వైవి సుబ్బారె డ్డి.. హటాత్తుగా చీరాలకు చెందిన ఎడం బాలాజీకి సీటు ఇప్పించారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్ధి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు.
అయితే ఓడిపోయిన తర్వాత పరుచూరు నుంచి దుకాణం సర్దుకున్న బాలాజీ, తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి కొద్దిరోజుల వరకూ ఆ నియోజకవర్గానికి వైసీపీ ఇన్చార్జి లేకుండా పోయారు. ఆ క్రమంలో పార్టీ అధినేత జగన్.. పరుచూరు నియోజకవర్గ ఇన్చార్జిగా, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డిని నియమించాలని స్వయంగా ఆదేశించి, ఈ విషయాన్ని సుబ్బారెడ్డికి చెప్పాలని తన వ్యక్తిగత కార్యదర్శికి చెప్పారట.
దానితో రంగంలోకి దిగిన సుబ్బారెడ్డి.. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఎస్సీ, రెడ్డి, బ్రాహ్మణ ఇన్చార్జిలు ఉన్నారని, ఒక్క కాపు కూడా లేనందున ఆ సామాజికవర్గానికి చెందిన ఎడం బాలాజీకి, పరుచూరు నియోజకవర్గ ఇన్చార్జి ఇవ్వాలని సిఫారసు చేశారట. దానితో జగన్.. అమెరికాలో ఉన్నవాడు అక్కడ ఏం పనిచేస్తాడు? మనం ధర్నా, ఆందోళన కార్యక్రమాలు పెంచబోతున్నాం కదా? అందుకే గాదెకు ఇద్దాం అని అన్నారట.
దానితో సుబ్బారెడ్డి షాక్ తిని, వెంటనే అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటున్న బాలాజీకి ఫోన్ చేసి, అర్జెంటుగా వచ్చి నియోజకవర్గ ఇన్చార్జి పదవి తీసుకోకపోతే, కొంప కొల్లేరవుతుందని హెచ్చరించారట. దానితో ఆగమేఘాలపై వచ్చిన బాలాజీని, పులివెందులకు తీసుకువెళ్లిన సుబ్బారెడ్డి.. ఇకపై బాలాజీ ఇక్కడే ఉంటారని చెప్పి, ఇన్చార్జి పదవి ఇప్పించారు.
బాలాజీ కూడా తాను ఇకపై ఇక్కడే ఉండి, పార్టీ కోసం పనిచేస్తానని జగన్‌కు హామీ ఇచ్చారట. దానితో ‘నువ్వు వెళ్లి మండల కమిటీలు వేసి, ఆ లిస్టు సుబ్బారెడ్డికి ఇవ్వమ’ని ఆదేశించారట. అన్నింటికీ తలూపిన బాలాజీ, కొద్దిరోజులకే మళ్లీ అమెరికాకు తుర్రుమన్నారట. ఫలితంగా మండల కమిటీలు నిలిచిపోయాయి. దానితో మళ్లీ బాలాజీకి, సుబ్బారెడ్డి ఫోన్ చేస్తే.. ‘నేను అన్నీ వదులుకుని అక్కడికి వచ్చేస్తే ఇక్కడ నా వ్యాపారాలు ఏమవుతాయి? అందుకే నా తమ్ముడు నియోజకవర్గం చూసుకుంటాడని’ చావు కబురు చల్లగా చెప్పారని, పార్టీ వర్గాల సమాచారం.
దానితో పాపం గాదె మధుసూదన్‌రెడ్డి ఎటూ కాకుండా పోయినట్లయింది. ఇటీవల పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయనను ఆహ్వానిస్తే, ఇంతకూ తాను ఏ నియోజకవర్గానికి చె ందిన వాడినో తేల్చానని చెప్పి, ఆ కార్యక్రమానికి ముఖం చాటేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా పరిణామాలతో బాలాజీని పరుచూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించి, అక్కడ తన పెత్తనం కొనసాగించాలన్న జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి ప్లాన్ బెడిసికొట్టిందట. పరుచూరుకు గాదె ఇన్చార్జిగా వస్తే, ఆయన తన మాట వినడని.. పైగా జిల్లాలో తానొక్కడి పెత్తనం సాగాలి తప్ప, మరొక రెడ్డి పోటీకి రాకూడదన్నది ఆయన వ్యూహమట. అదే బాలాజీ ఇన్చార్జిగా ఉంటే తన పట్టు సడలదన్న ముందుచూపుతోనే, గాదె మధును వెనక్కి నెట్టి బాలాజీని రంగంలోకి దింపారని పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు.
అసలు పార్టీలో జగన్ మాట కంటే, కోటరీ ఆదేశాలే అమలవుతున్నాయన్న నిజం, గతంలో బాపట్ల జిల్లా అధ్యక్ష పదవితోనే స్పష్టమయింది. గతంలో ఇదే గాదె మధుసూదన్‌రెడ్డికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు నాయకుల సమావేశంలోనే జగన్ ప్రకటిస్తే..కోటరీ రంగంలోకి దిగి, ఆయనకు బదులు మాజీ మంత్రి నాగార్జునను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించింది. దానితో జగన్‌దంతా మేకపోతు గాంభీర్యమేనని, అసలు పార్టీని నడిపిస్తున్నదంతా ఆయన కోటరీయేనని ఆ ఘటన నిరూపించింది. ఫలితంగా జగన్ వద్దకు బదులు.. పార్టీ నేతలు కోటరీ నేతలనే కలుస్తున్న వైచిత్రి.
కాగా బాపట్ల ఇన్చార్జిగా ఉన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సీటు కింద నీళ్లు తెచ్చి, ఆయన స్థానంలో లేళ్ల అప్పరెడ్డిని బాపట్ల ఇన్చార్జిగా నియమించాలని, కోటరీ రంగం సిద్ధం చే సినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేయాలన్నది అప్పిరెడ్డి లక్ష్యమట.
ఉమ్మడి గుంటూరు జిల్లా ఇన్చార్జిగా ఉన్న సుబ్బారెడ్డికి, తన సొంత బాపట్ల జిల్లాకు సైతం ఇన్చార్జి పదవి లభించిందంటే ఆయన హవా ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చంటున్నారు. నాయకులకు ఒక్కో జిల్లా మాత్రమే ఇన్చార్జిగా ఇస్తే, సుబ్బారెడ్డికి తన సొంత జిల్లాకు ఇన్చార్జిగా ఎలా నియమిస్తారని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశంపై తన పట్టు పోకూడదన్న లక్ష్యంతో.. సుబ్బారెడ్డి జిల్లాలో నడిపిస్తున్న రాజకీయాలతో వైసీపీ భూస్థాపితం అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సో.. పార్టీలో జగన్ డమ్మీనే అని.. అంతా ‘పులివెందుల అదృశ్యశక్తి’తో సన్నిహితంగా ఉండే కోటరీ హవానే నడుస్తుందన్న నిజం రెండోసారి నిజమయింది. జగన్ నాయకులందరి ముందు ఫలానా నేతను నియమించాలని ఆదేశించినప్పటికీ, వెంటనే రంగంలోకి దిగే కోటరీ, అందుకు విరుద్ధంగా మరొరిని నియమిస్తోందన్నారు. ఇది అన్ని జిల్లాల్లోనూ జరుగుతోందని సీనియర్లు చెబుతున్నారు. జగన్ గతంలో సీబీఐనుద్దేశించి సీబీఐ కాంగ్రెస్ పంజరంలోకి చిలక అని విమర్శించేవారు. ఇప్పుడు ఆయన పార్టీ నాయకులు.. ‘జగన్ కోటరీ పంజరంలోని చిలక’ అని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తుల పేర్లే మార్పు. మిగిలిన పంజరం డైలాగ్ సేమ్ టుసేమ్ అన్నమాట!
1 COMMENTS