– రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల భూముల కోసం రీజినల్ రింగ్ రోడ్డుకి, ఫోర్త్ సిటీకి మధ్యలో రోడ్డు
– బంధుప్రీతి లేని ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయి?
– గతంలో ఎల్&టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను జైల్లో పెడతానని బెదిరించారు
– తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు, విద్యార్థులు కనీసం రౌండ్‌టేబుల్ సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. అన్ని వర్గాల పైన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయని, ఆరోగ్యశ్రీ సేవలు రద్దు చేయడంతో హాస్పిటళ్లు స్తంభించాయని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన ఒక్క పని అయినా చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆశా వర్కర్లు, రేషన్ డీలర్ల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదని, గతంలో ప్రగతి భవన్ గురించి అనేక అబద్ధాలు చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి వేధింపుల వల్లనే మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్&టీ తప్పుకుంటున్నది
ముఖ్యమంత్రి బెదిరింపులు, ముడుపుల కోసం వేధింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్&టీ సంస్థ వైదొలుగుతోందని కేటీఆర్ అన్నారు. గతంలో ఎల్&టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను జైల్లో పెడతానని బెదిరించారని, ఇలాంటి దుర్మార్గమైన చర్యల వల్ల ప్రైవేట్ కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు.
త్వరలో గతంలో వివాదాస్పదమైన ఎంఆర్ సంస్థ ఆస్తులను రేవంత్ రెడ్డి అమ్మబోతున్నారని, ఇందులో ఆయన ఎంత కమిషన్ తీసుకున్నారో తెలుస్తుందని అన్నారు. గతంలో పలు కంపెనీలపై ఉన్న కేసులను అడ్డుపెట్టుకుని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని, అన్ని కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయాల్సిందిపోయి, పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాల్సిందిపోయి పక్కన పెట్టారని అన్నారు.
రాష్ట్రంలో కొత్త పార్టీల ఏర్పాటుపై ..
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందని, తమ వాయిస్ వినిపించే హక్కు ఉందని కేటీఆర్ అన్నారు. కొత్త పార్టీలు పెట్టుకుని తమ విధానాలను ప్రజలకు చెప్పి వారి దగ్గరకు వెళ్లవచ్చని స్వాగతించారు. తాము బతుకమ్మ చీరలు కులం, మతం, అంతం, వేదం లేకుండా అందరికీ ఇచ్చామని, అయితే ఈ ప్రభుత్వం కొందరికి మాత్రమే ఇస్తోందా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ బంధుప్రీతిపై..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో బంధుప్రీతి లేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందించారు. సుజన్ రెడ్డి, అమిత్ రెడ్డిలకు వందల కోట్ల కాంట్రాక్టులు కొత్తగా ఇచ్చారని, మరి బంధుప్రీతి లేని ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ముడుపులు వసూలు చేసి ఢిల్లీకి పంపించడమే రేవంత్ రెడ్డి ఏకైక పని అని ఆరోపించారు. అసెంబ్లీలో మైక్ ఇస్తే తాము కూడా మాట్లాడతామని, ప్రభుత్వాల తీరును వివరిస్తామని అన్నారు.
డ్రగ్స్ వ్యవహారంపై ..
తనపై ఉన్న వ్యక్తిగత కోపాన్ని రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతన్నల పైన తీర్చుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల నేతన్నల పొట్ట కొట్టి, మొత్తం పరిశ్రమను అల్లకల్లోలం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినా ముఖ్యమంత్రికి కనీసం సమాచారం లేదని, దేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ దందా రాష్ట్రంలో జరగడం దారుణమని అన్నారు.
ఇంత పెద్ద అరాచకం జరుగుతుంటే ఈగల్ టీం, హైడ్రా అంటూ ఎందుకు తమాషాలు చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు హైడ్రా ఇప్పటిదాకా ఏం పని చేసిందని, ఇవన్నీ చేస్తే వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం ఎందుకు మునిగిపోతుందని నిలదీశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ‘కుడితిలో ఎలుకల’ మాదిరిగా మారింది
పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ‘కుడితిలో ఎలుకల’ మాదిరిగా మారిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నియోజకవర్గ నాయకుల పరిస్థితి చూస్తే జాలి కలుగుతోందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పోరాడిన ప్రతి ఒక్కరూ దారుణంగా మోసపోయారని అన్నారు. నిజంగా రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే వెంటనే ఉప ఎన్నికలు పెట్టాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ బీ-ఫారమ్‌తో పోటీ చేసిన దానం నాగేందర్ స్పీకర్‌ను ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు.
రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై కాంగ్రెస్ పై కేటీఆర్ ఆరోపణలు
రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపొందించామని, కానీ దాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం మార్చుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. దీంతో వేలాది మంది రైతులు తమ భూములు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని అన్నారు. ఫోర్త్ సిటీ దగ్గర ఉన్న తమ భూముల కోసం అలైన్మెంట్ మార్చి, రీజినల్ రింగ్ రోడ్ స్వరూపాన్ని మార్చేశారని, దీని వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం, రీజినల్ రింగ్ రోడ్ కోసం మాత్రం తమ భూములకు లాభం చేకూర్చడానికి భూములు తీసుకుంటామని చెబుతోందని విమర్శించారు. రీజినల్ రింగ్ రోడ్డుకి, ఫోర్త్ సిటీకి మధ్యలో వేస్తున్న రోడ్డు కేవలం రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల భూముల కోసం వేస్తున్నారని, ఈ రోడ్డు వెంబడి అనేక మందితో భూములు కొనుగోలు చేసి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు.
ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండా రూపొందించిన ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేని రేవంత్ రెడ్డి రద్దు చేశారని కేటీఆర్ అన్నారు. ఒక మంత్రి ‘మా ప్రభుత్వం వచ్చేది లేదు, చచ్చేది లేదు’ అంటుంటే, ఇంకొక మంత్రి ‘రీజినల్ రింగ్ రోడ్ వచ్చేది లేదు, వచ్చేది లేదు’ అంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఎంపీలను బీజేపీకి మేకలు, గొర్రెల మాదిరిగా అమ్మేసిన రేవంత్
రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్నింటినీ అమ్మేస్తాడని, గతంలో పీసీసీ పీఠాన్ని కొని, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి మేకలు, గొర్రెల మాదిరిగా అమ్మేశాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అని ఎవరూ అనుకోవడం లేదని, ఆయన ముమ్మాటికీ బీజేపీ మనిషే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మీడియా మేనేజ్మెంట్, పీఆర్ మేనేజ్మెంట్ మీద నడుస్తోందని, క్షేత్రస్థాయిలో ఏం జరగడం లేదని విమర్శించారు. నిజంగా పాలన బాగుంటే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ మూడు రంగుల జెండా పాట ఎందుకు వినిపించడం లేదని అన్నారు.
బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లపై ..
‘బీసీ డిక్లరేషన్‌కి సంబంధించి అప్పుడే ఇన్ని షరతులు పెట్టేది ఉండేనా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని ఖరాఖండిగా చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి గతంలో రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఇస్తే ఉరితీయాలని అన్నారని గుర్తుచేశారు.
రానున్న సంవత్సర కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఉప ఎన్నికలు వరుసగా వస్తాయని, కనీసం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనంత బలహీనంగా ఉందని కేటీఆర్ అన్నారు.
‘రేవంత్ రెడ్డి యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలియదు’ అని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు యువతతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని, ఆయన పతనం తప్పదని అన్నారు. గ్రూప్-1 పరీక్షలో జరిగిన అవకతవకలను రాష్ట్ర హైకోర్టు గుర్తించిందని, విద్యార్థులకు జరిగిన నష్టాన్ని కూడా గుర్తించిందని తెలిపారు. మూడు కోట్ల రూపాయలకు గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకున్నారని అభ్యర్థులే చెబుతున్నారని, ఏ మంత్రి డబ్బులు తీసుకున్నారో అభ్యర్థులనే అడగాలని అన్నారు. ఆ మంత్రి పేరును కూడా అభ్యర్థులు చెప్పారని తెలిపారు.
ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. కొంతమంది గ్రూప్-1 అభ్యర్థుల కుటుంబాలను తమపై ఎగదోస్తే ప్రభుత్వానికి ఏమొస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 29 తో తీవ్రమైన నష్టం చేసిందని, ఇంత దారుణమైన పరిస్థితి, అవినీతి గ్రూప్-1 పరీక్షల్లో జరుగుతుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. గతంలో పేపర్ లీక్ అంటూ సీబీఐ విచారణ అంటూ హడావిడి చేసిన బీజేపీ ఇప్పుడు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. సీబీఐ విషయంలో రాహుల్ గాంధీది ఒక మాట, రేవంత్ రెడ్డిది ఇంకొక మాట అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో ఇద్దరు ఆడబిడ్డలు హత్యకు గురైతే ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.