– సచివాలయం, హెచ్ఓడీ, మంత్రుల పేషీలు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏడీజీ సునీల్ ‘ఎయిమ్’ సంస్థ సభ్యులు
– ఎయిమ్ సభ్యులతో సర్కారు డేటాకు ప్రమాదం – కీలక సమాచారం చేరవేస్తే ప్రజలకు నష్టం
– ‘ఎయిమ్’ సభ్యులను గుర్తించి చర్యలు తీసుకోండి – కాకినాడలో ఎయిమ్ సభ్యుల ఆర్టీఐ మాఫియా
– పరిశ్రమలను ఆర్టీఐ పేరుతో బెదిరిస్తున్నారు
– పెట్టుబడుల వేళ వారితో పెను ప్రమాదం
– బాబు, లోకేష్ కష్టం వృధా చేయవద్దు
– సర్కారు శాఖల్లో ‘ఎయిమ్’ సభ్యులను ఏరివేయండి
– సీఎస్ విజయానంద్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన లేఖ
అమరావతి: సస్పెన్షన్‌లో ఉన్న ఏడీజీ- గత సీఐడీ చీఫ్ పివి సునీల్‌కుమార్ నాయకత్వంలోని అంబేద్కర్ ఇండియా మిషన్ (ఎయిమ్) సభ్యులు, ప్రభుత్వ శాఖల సమాచారాన్ని లీక్ చేస్తున్నందున.. ఎయిమ్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులెవరో గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సీఎస్ విజయానంద్‌కు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. రఘురామకృష్ణంరాజు తన లేఖలో సీఎస్‌కు ఏం ఫిర్యాదు చేశార ంటే.. సస్పెన్షన్‌లో ఉన్న ఐపిఎస్ అధికారి పివి సునీల్‌కుమార్‌కు చెందిన ఎయిమ్ సభ్యులు.. అమరావతిలోని వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, పేషీలు, హెచ్ఓడీ కార్యాలయాల నుంచి.. జిల్లాల్లోని కలెక్టర్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
వీరు ప్రభుత్వానికి చెందిన కీలక సమాచారాన్ని సంస్థకు అందించడం ఆందోళనకర అంశం. కాకినాడ లాంటి పారిశ్రామిక ప్రాంతంలో ఈ సంస్థ సభ్యులు ఆర్టీఐ యాక్టివిస్టుల పేరుతో పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్న పరిస్థితి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువమంత్రి లోకేష్ అహోరాత్రులు కష్టపడి, విదేశీ పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారు. ఇటీవల విశాఖలో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కూడా విజయవంతం చేసుకున్నాం. దానికి అపూర్వ స్పందన లభించింది.
వారి పట్టుదల-కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు-పరిశ్రమలు వస్తున్న వేళ.. పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి బెదిరింపు వాతావరణం ఉండటం- కొనసాగడం ఆందోళకన కలిగించేదే.పైగా ప్రభుత్వ సమాచారంతోపాటు, ప్రజల డేటా బయటకు వెళ్లడం మరింత ప్రమాదకరం. గోప్యంగా ఉండాల్సిన ప్రభుత్వ రహస్యాలు, ఉత్తర్వులు, సర్క్యులర్లు ఒక కులానికి చెందిన సంస్థ చేతిలో పడటం మంచిదికాదు. కాబట్టి అత్యంత కీలకమైన ఈ అంశంపై విచారణ జరిపించి, ఎయిమ్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.
