– బాబు గతంలో కాంగ్రెస్‌పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళలేదా?
– రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కాదా?
– ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డితో అవినీతి సొమ్ము పంపించలేదా?
– తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, రాహూల్‌గాంధీతో కలిసి చంద్రబాబు పనిచేయలేదా?
– లోకేష్ ట్వీట్లో పెట్టిన ఫోటోలోనే దొంగ ఓటర్లు కనిపిస్తున్నారు
– తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లి: స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా చంద్రబాబు తనకు అలవాటైనా అబద్దాలనే ప్రజల ముందు మాట్లాడారని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు.
తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్… సూపర్ హిట్ అంటూ ఆయన మాట్లాడింది చూస్తే… చంద్రబాబుది సూపర్ చీటింగ్ అంటూ ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. చివరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీం ప్రారంభంలోనూ ఆంక్షలు పెట్టి, నిస్సిగ్గుగా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని ధ్వజమెత్తారు.
సీఎం చంద్రబాబు విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చేసిన ప్రసంగంలోనూ తనను గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై అసత్యపు విమర్శలు చేశారు. కనీసం స్వాతంత్ర్య దినోత్సవం నాడు అయినా కొన్ని నిజాలు మాట్లాడతారుని అనుకుంటే, తన సహజ నైజం మళ్లీ బయటపెట్టుకున్నాడు. సూపర్‌సిక్స్ సూపర్ హిట్ అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు. అసలు సూపర్ సిక్స్… హిట్ ఎలా అయ్యిందో చెప్పాలి.
తల్లికి వందనం గత ఏడాది ఎగ్గొట్టారు. 9.7.2024న జారీ చేసిన జీఓలో విద్యార్ధుల తల్లులకు రూ.15వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చాలా స్పష్టంగా రాశారు. ఈ జీఓను ఏడాది తరువాత అమలు చేస్తారా? ఇది మోసం కాదా చంద్రబాబూ? దీనిపై వైయస్ఆర్సీపీ వెంటపడటం వల్ల ఈ ఏడాది ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. కొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.6 వేలు ఇలా అరకొరగానే తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం అన్నారు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1.59 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వారికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు కావాలి. కానీ తొలివిడతలో రూ.895 కోట్లు మాత్రమే కేటాయించారు, ఇక రెండో ఏడాది రూ.2600 కోట్లు కేటాయించారు. అంటే దీనిని ఏమంటారో చంద్రబాబే చెప్పాలి. అన్నదాత సుఖీభవ పథకంను గత ఏడాది ఎగ్గొట్టారు. కేంద్రం ఇచ్చే దానితో కలిసి రూ.26వేలు ఏడాదికి ఇస్తానని చెప్పి, రెండే ఏడాది రూ.7 వేలతో సరిపెట్టారు.
నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేలు అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వలేదు. స్త్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఈ రోజు ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడూ అంటూ వైయస్ఆర్సీపీ వెంటపడితే తప్ప, ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రాలేదు. ఉచిత బస్సు పథకంలోనూ మహిళలను మోసం చేశారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పద్నాలుగు నెలల తరువాత పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ కేటగిరిలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అంటూ అవకాశం ఇచ్చారు. పదహారు కేటగిరిల్లో కేవలం ఈ పరిమిత కేటగిరిల్లోనే ప్రయాణించాలని ఆంక్షలు పెట్టడం దారుణం కాదా?
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వల్లే పోలవరం, అమరావతి ఆగిపోయింది అంటూ సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు అబద్దాలు అడుతున్నారు. పోలవరంను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ అయిదేళ్ళ పాలనలో సోమవారాన్ని పోలవరం అనేవాడు. ఇప్పుడు కనీసం అటు వైపు వెళ్ళే ధైర్యం చేయడం లేదు. డయాఫ్రంవాల్ మేం చెడగొట్టామని అబద్దాలు చెబుతున్నాడు. కాఫర్ డ్యాంలను నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించి, దానిని నిర్వీర్యం చేశారని నిపుణుల కమిటీనే చంద్రబాబు నిర్వాకాన్ని ఎత్తి చూపింది..
అవినీతి సొమ్ము కోసమే సింగపూర్ జపం
టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు సీఎంగా సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెట్టుబడి పెడుతుందని అబద్దం చెప్పాడు. సింగపూర్‌లోని కొన్ని ప్రైవేటు కంపెనీలతో అవినీతి ఒప్పందాలు చేసుకుని, జేబులు నింపుకున్నాడు. ఈ వ్యవహారంలో సహకరించిన ఆనాటి సింగపూర్ ప్రభుత్వంలోని మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి, జైలుకు వెళ్ళాడు. దీనితో చంద్రబాబు వేసుకున్న ప్లాన్లు అన్ని రివర్స్ అయ్యాయి.
ఇప్పుడు సీఎంగా మళ్ళీ సింగపూర్ వెళ్ళి, తిరిగి తన దందాను కొనసాగించాలని చూస్తే, వారు తిరస్కరించారు. దీనికి వైయస్ఆర్సీపీ కారణమంటూ మాపైన ఏడుస్తున్నాడు. రాజధానిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. 52 వేల ఎకరాలను పూర్తి చేయడంకుండా మరో 43 వేల ఎకరాలను సేకరించాలని చూస్తున్నాడు. ఇప్పటికే రాజధాని పనుల్లో కాంట్రాక్ట్‌లు ఇవ్వడం, దానికి గానూ ముందుగానే మెబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చి, అందులోంచి ఎనిమిది శాతం కమిషన్‌గా తీసుకోవడం చేస్తున్నాడు. వీటన్నింటినీ నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నాడు. సూట్ కేసులు సర్దడమే లోకేష్ పని.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అద్భుతంగా జరిగిందని, ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని పవన్ కళ్యాణ్, లోకేష్‌లు మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక మరెక్కడా జరిగి వుండదు. మంత్రి నారా లోకేష్ తన ట్వీట్లో పెట్టిన ఫోటోలో ఓటు వేస్తున్న క్యూలైన్లో ఉన్న వ్యక్తి జమ్మలమడుగు లోని మార్కెట్ యార్డ్ చైర్మన్. ఆయన వేశాడేమో ఈ స్లిప్. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తమను తాము గొప్పగా చెప్పుకోవడం సిగ్గు చేటు.
చంద్రబాబుకు కూడా సోదరీమణులు ఉన్నారు. వారెప్పుడైనా ఆయనకు రాఖీలు కట్టిన సందర్భం ఉందా? కనీసం అమరావతిలో కొత్త ఇంటి శంకుస్థాపనకు అయినా వారిని పిలిచి ఒక్క చీరె అయినా పెట్టారా? తన మేనత్తల గురించి కనీసం మాట్లాడలేని లోకేష్ దానిని మరిచిపోయి వైయస్ జగన్ సోదరీమణుల గురించి మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు తన సోదరుడిని ఎంత బాగా చూశాడో ప్రజలందరికీ తెలుసు. ముందు వాటి గురించి తెలుసుకుని లోకేష్ మాట్లాడితే బాగుంటుంది.
ఎన్నికలు అయిపోయిన తరువాత కౌంటింగ్‌కు మధ్యలో 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాలి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహూల్ గాంధీ హాట్లైన్లో ఉన్నారన్న వైయస్ జగన్ మాటల్లో తప్పేముందీ? చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళలేదా? రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కాదా? ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డితో అవినీతి సొమ్ము పంపించలేదా? తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, రాహూల్‌గాంధీతో కలిసి చంద్రబాబు పనిచేయలేదా?