Home » ఆర్థికంగా ఆదుకోండి

ఆర్థికంగా ఆదుకోండి

-అప్పుల్లో కూరుకుపోయాం
-ఆర్థిక మంత్రి నిర్మలకు ఏపీ సీఎం వినతి  

గత ప్రభుత్వ నిర్ణయాలు, పనుల కారణంగా రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు. ఆర్థికంగా తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా.. వివిధ మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి తగినంత సహాయం చేయాలని కోరారు. నిర్మలతో జరిగిన భేటీలో పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీయే ఎంపీలు ఉన్నారు.

అనంతరం కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. సాయంత్రంలోగా మరికొందరు కేంద్రమంత్రులతోనూ చంద్రబాబునాయుడు సమావేశమై.. రాష్ట్రపరిస్థితుల గురించి వివరించనున్నారు. జపాన్ రాయబారితోనూ చర్చలు జరుపనున్నారు. సాయంత్రానికి ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని చంద్రబాబు హైదరాబాద్ బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం భాగ్యనగరంలో చంద్రబాబు భారీ ర్యాలీలో పాల్గొంటారు.  రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పలువురు కేంద్రమంత్రులతో సమావేశమైన చంద్రబాబు కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూత నందించాలని ప్రధానిని కోరారు.

అలాగే ఈ నెల నాలుగో వారంలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. అందులో ఏపీకి ఇచ్చే ప్రాధాన్యతపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన తొలి జీతాన్ని విరాళంగా ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడికి రూ.1.57 లక్షల చెక్కును అందజేశారు. రాజధాని నిర్మాణానికి విరాళమిచ్చిన ఎంపీని చంద్రబాబు అభినందించారు.

Leave a Reply