-ఆదివాసీలు ఉన్నత స్థాయికి రావడం అరుదు
-ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం సంతోషం
-ముర్మును ఎంపిక చేసిన ప్రధానికి అభినందనలు
-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
రాష్ట్రపతి అంటే దేశానికి ప్రథమ పౌరునిగా వ్యవహరిస్తారని, ద్రౌపది ముర్ము ఒక పేద కుటుంబంలో పుట్టిన ఆదివాసీ మహిళ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ముర్ము హుందాతనం, జీవితాన్ని పరిశీలిస్తే అట్టడుగునున్న ఆదివాసీల కోసం, పేదల కోసం కష్టపడి పనిచేశారని కొనియాడారు. విజయవాడలోని ఓ హోటల్ లో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్ముతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘మారుమూల గ్రామంలో పుట్టి, కష్టపడి చదువుకుని అంచలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్రపతిగా ఎంపికయ్యే స్థితికి వచ్చారంటే అది దేశరాజ్యాంగ విశిష్టత. ఒక సాధారణ పౌరులు కూడా అసాధరమైన స్థానానికి ఎంపికయ్యారేందుకు ఉదాహరణ ద్రౌపది ముర్ము. ముర్ము మనపక్క రాష్ట్రమైన ఒరిస్సాలో ఉండటం మనందరి అదృష్టం. గిరిజనులు, ఆదివాసీలను ఉన్నతస్థాయికి తీసుకురావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ సందర్భంగానే నేడు ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో సామాజిక న్యాయం కోసం పూర్తిగా బలపరచాలన్న ఉద్దేశంతోనే టీడీపీ మద్ధతివ్వాలనే నిర్ణయం. రాజకీయాల్లో నేను ప్రముఖపాత్ర వహించే సమయం వచ్చినప్పుడు నాలుగైదు అవకాశాలు వచ్చాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కే.ఆర్.నారాయణ్ ను రాష్ట్రపతిగా ఎంపిక చేశాం. తర్వాత వాజ్ పేయ్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం, అనంతరం రామ్ నాథ్ కోవింద్, ఇప్పుడు ద్రౌపదిముర్ము రాష్ట్రపతి అభ్యర్థులుగా వచ్చారు. ఈ నలుగురిలో ఇద్దరు ఎస్సీ, ఒక మైనారిటీ, ఒక ఎస్టీని ఎంపిక చేయడంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నా.
ద్రౌపదిముర్మును ఎంపిక చేసిన ప్రధాని నరేంద్రమోడీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గ్రామ స్థాయి నుండి అంచలంచెలుగా ముర్ము ఎదిగి, కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్ గా పని చేసిన ఏకైక ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము. ముర్మును ఎంపిక చేసి దేశంలో సామాజిక న్యాయం చేసే అవకాశం వచ్చినందువల్ల టీడీపీ కూడా బాధ్యతగా వ్యవహరించి మద్ధతు తెలపాలని నిర్ణయించాం. ముర్ము హుందాతనం, నిబద్ధత చూస్తే చాలా సంతోషం వేస్తోంది. ముర్ము ఎంపికతో దేశం మొత్తం ఆమె వైపు చూస్తోంది. ముర్ముకు మద్ధతు తెలపడం గర్వించదగ్గ విషయం. టీడీపీ తరపును పూర్తి సహకారం అందిస్తాం. రాష్ట్రం నుండి రాష్ట్రపతికి ఏకగ్రీవంగా మద్ధతు తెలపడం సంతోషంగా ఉంది.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
ఒక ఆదివాసీ ,గిరిజన మహిళ అందులోనూ మా జిల్లాకు అతి దగ్గరగా ఉన్న ప్రాంతానికి చెందిన శ్రీమతి దౌపతి ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం . అన్న ఎన్టీఆర్ మొదలుకొని చంద్రబాబు గారి వరకూ సామాజిక న్యాయానికి కట్టుబడి దేశ రాజకీయాల్లో ఎందరికో సముచిత స్థానం కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. మొదట్నుంచి ద్రౌపతి ముర్ము వివాదరహితురాలు. గ్రామ పంచాయతీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా , రాష్ట్ర గవర్నర్ గా అశేష అనుభవం కలిగిన ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం, ఆమె అభ్యర్థిత్వానికి మనందరం మద్దతు తెలపడం అదృష్టంగా భావిస్తున్నాను. ద్రౌపతి ముర్ము గారి నాయకత్వంలో మన దేశం మరింత ముందుకు వెళుతుందని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.