– రూ.1,100 కోట్ల కరోనా ఆర్థికసాయం దారి మళ్లించారని ఆరోపణలు
– ఇదే చివరి అవకాశమని హెచ్చరిక
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శితో నడుస్తోందా అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు చెల్లించాల్సిన ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు రూ.1,100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాలకు మళ్లించిందంటూ తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
పిటిషన్‌ను ఏప్రిల్ 13వ తేదీన విచారించిన సుప్రీంకోర్టు .. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు పీడీ ఖాతాలకు మళ్లించొద్దని..ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని నాడు ఆదేశించింది. పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను దారి మళ్లించలేదని.. పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పణకు తమకు మరికొంత సమయం కావాలని ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎం.నజ్కీ కోరారు. ఆర్థిక శాఖ కార్యదర్శి తండ్రి ఆసుపత్రిలో ఉండడంతో, ఆయన అందుబాటులో లేక పరిహారం పెండింగ్‌లో ఉందని ధర్మాసనానికి నివేదించారు.
స్పందించిన జస్టిస్ ఎం.ఆర్.షా ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శితో నడుస్తోందా అని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఆమోదం లేకుండా అఫిడవిట్ దాఖలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిస్సహాయతను వ్యక్తం చేశారు.
ఆయన (ఆర్థిక శాఖ కార్యదర్శిని ఉద్దేశించి) లేకపోతే మాత్రం ఆయన కార్యాలయం అక్కడ లేదా అంటూ జస్టిస్ ఎం.ఆర్.షా న్యాయవాదిని మందలించారు.కరోనా మృతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ఇతర అవసరాలకు వినియోగిస్తే దానిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేసేందుకు తుది అవకాశమిస్తున్నామని పేర్కొంది. కేసు తదుపరి విచారణను మే 13వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.