ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి ఎస్టీలకు వంద శాతం రిజర్వేషన్ల వర్తింపును నిలుపుదల చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్లను కేటాయించిన ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ కోర్టు రూ.5 లక్షల జరినామా విధించింది.
ఈ జరిమానాను రెండు తెలుగు రాష్ట్రాలు చెరో రూ.2.5 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ వ్యవహారంపై తాజాగా మంగళవారం తెలంగాణ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా జరిమానా చెల్లించని పక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించాల్సి ఉంటుందని కూడా కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మేరకు సదరు జీవోను రద్దు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే రూ.2.5 లక్షల జరిమానాను చెల్లించింది. అయితే తెలంగాణ మాత్రం జీవోను రద్దు చేసినా… జరిమానాను మాత్రం చెల్లించలేదు. దీనిపై సుప్రీంకోర్టులో మంగళవారం ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. రివ్యూ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందుననే తెలంగాణ సర్కారు జరిమానాను చెల్లించలేదని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ‘ముందుగా జరిమానా చెల్లించాల్సిందే… మిగిలినవన్నీ తర్వాత చూసుకోవచ్చు’ అంటూ కోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.