పౌర హక్కుల సంఘం నేత వరవరరావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను గురువారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై జులై 11న విచారణ చేపట్టనుంది. బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావును మహారాష్ట్ర పోలీసులు చాలా కాలం క్రితమే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పలుమార్లు వరవరరావు పిటిషన్లు దాఖలు చేసినా ఆయనకు అనుకూలంగా తీర్పులు వెల్లడి కాలేదు. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ ఇవ్వాలని వరవరరావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను బాంబే హైకోర్టు ఇటీవలే తోసిపుచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాజాగా వరవరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై జులై 11న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.