– బుగ్గనపై సర్వత్రా వ్యతిరేకత
– అప్పుల మంత్రి పేరుతో అప్రతిష్ఠ
– డోన్‌లో కన్నా ఢిల్లీలోనే ఎక్కువ మకాం
– సర్వత్రా ‘పానీ’పట్టు యుద్ధాలే
– మంచినీటి సమస్యతో ‘ఫ్యాను’కు కష్టకాలం
– బుగ్గనను విడిచి కోట్ల వెంట నడుస్తున్న అనుచరులు
– కోట్ల ఇమేజ్ ముందు బుగ్గన వెలవెల
కర్నూలు: కేంద్రమాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి ఆయన నిజాయితీ, నిరాడంబరతే గెలుపు సోపానమవుతోంది. ఆయనకున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్, తండ్రి కోట్ల విజయభాస్కరరెడ్డికి చిరస్థాయిగా నిలిచిపోయిన కీర్తి ప్రతిష్ఠలు, కష్టాల్లో ఆదుకునే నైజం, ఇప్పుడు డోన్‌లో టీడీపీ విజయానికి కారణమవుతోంది. రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి అర్ధ-అంగబలంలో ముందున్నప్పటికీ, కోట్ల చాలా నిరాడంబరంగా చేస్తున్న ప్రచారం, ప్రజలు ఆయన వైపు మొగ్గేలా చేస్తోంది.
కోట్ల కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఫలాలు ఇంకా ప్రజల కళ్లెదుటే కనిపిస్తున్నాయి. అవినీతికి దూరంగా.. అభివృద్ధికి దగ్గరగా ఉండే కోట్లకు, ఎన్నికల ప్రచారంలో భార్య సుజాతమ్మ కొండంత అండ. ప్రచారంలో యావత్ కుటుంబసభ్యులంతా ఎన్నికల క్షేత్రంలో దిగారు. కోట్ల స్వతహాగా మృదుస్వభావి అయితే, సుజాతకు ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది. నమ్ముకున్న కార్యకర్తల కోసం ఏమైనా చేసే వారి దూకుడే, కోట్లను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపేందుకు కారణమయింది.
బుగ్గన పేరుకు ఆర్దిక మంత్రి అయినప్పటికీ, ఆయన డోన్‌లో కంటే అప్పుల కోసం ఢిల్లీలోనే ఎక్కువకాలం గడుపుతున్న వైనం ప్రజలకు నచ్చడం లేదు. బుగ్గన పుణ్యాన డోన్‌కు అప్పులమంత్రి నియోజకవర్గం అన్న చెడ్డపేరు వచ్చిందని ప్రజలు మండిపడుతున్న పరిస్థితి. ఆర్ధికమంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ‘పానీ’పట్టు యుద్ధాలు, మంచినీటి సమస్య బుగ్గనకు మైనస్ పాయింట్‌గా మారింది.
పైగా నియోజకవర్గంలో పనులన్నీ ఆయన అనుచరులకే కట్టబెట్టడం, రౌడీఇజం పెచ్చరిల్లడం, స్వయంగా బుగ్గన అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు ఫ్యానుకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రధానంగా బుగ్గన మద్దతుదారులైన ముఖ్య నేతలంతా కోట్లకు జై కొట్టడం కూడా వైసీపీకి మైస్ పాయింటుగా మారాయి.
బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డికి ప్రతికూల అంశాలు ఇవే..
– కార్యకర్తలకు, నాయకులకే కాకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవటం
– రిజర్వేషన్లను మార్చి డోన్, బేతంచెర్ల మున్సిపల్ చైర్మన్ పదవులను అమ్ముకున్నారన్న ఆరోపణలు
– డోన్‌లో విచ్చలవిడిగా సాగుతున్న భూకబ్జాలు, ఇసుక దోపిడీ, మట్కా, మద్యం, గంజాయి వ్యాపారాలకు మంత్రి అండదండలు ఉన్నాయన్న విమర్శలు
– అభివృద్ధి పనుల కాంట్రాక్టు పనులన్నీ కమీషన్ ఇచ్చిన వారికే కట్టబెట్టడుతున్నారని సొంత వర్గం వారే ప్రచారం చేయడం… నాణ్యత లేకపోయినా బిల్లులు ఇచ్చారన్న ఆరోపణలు
– అభివృద్ధి పనుల వెనుక స్వార్థ ప్రయోజనాలు, భారీగా చేతులు మారిన కమీషన్లు
– కొన్ని భవనాలు అభివృద్ధి కింద చూపి గొంతెండుతున్న ప్రజలకు తాగునీరు ఇవ్వకపోవడం
– నియోజకవర్గంలో వివాదాలు ఉన్న భూములు, ఇతర ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఉన్న వారి భూములు, విలువ ఉన్న ఇంటి స్థలాలను మంత్రి అనుచరులు కబ్జాలు చేశారన్న అభిప్రాయం బలంగా ఉండటం
– ఉపాధి పనుల్లో బినామీల చేతివాటంతో పేదలకు లబ్ది చేకూర్చలేదన్న చర్చ
– బేతంచర్ల, డోన్ ప్రాంతాల్లో మైనింగ్ వ్యాపారులపై దాడులు చేయించడం ద్వారా వాటి మూసివేతకు కారణమై వేలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేశారన్న ఆగ్రహం
– బేతంచెర్లలో 1956లో తన పూర్వీకులు సేకరించి విద్యాదానం ఎయిడెడ్ స్కూలు ఏర్పాటు చేసేందుకు ఇచ్చిన 13 ఎకరాల భూమి, భవనాలను తిరిగి మంత్రి బుగ్గన వెనక్కి తీసుకోవడం వల్ల పేద విద్యార్థు లకు విద్యను దూరం చేశారన్న విమర్శ
– మంత్రి మైనింగ్ ప్రాంతానికి దారి కోసం పేదల భూములు లాక్కోవడం
– సిమెంట్ ఫ్యాక్టరీని కొనుగోలు చేసి స్థానిక కార్మికుల కడుపు కొట్టి బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల నుంచి కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వడం.