– ఈ రెండు విభాగాలకు రెగ్యులర్ హెచ్వోడీలను నియమించాలి
– తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి: కల్తీతో కూడిన ఆహార పదార్ధాలు, నాణ్యత లోపించిన మందుల సరఫరా పరిణామాల దృష్ట్యా ఈ రెండు విషయాల్లో నిఘా వ్యవస్థను
పటిష్టం చేయాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆహార పదార్ధాల్లో కల్తీని అరికట్టే ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం) మరియు కల్తీ మందుల సరఫరాను నియంత్రించే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డిసిఎ) విభాగాల్లో వివిధ శ్రేణుల్లో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని మంత్రి సూచించారు.
మంత్రిత్వ శాఖలోని పలు విభాగాల పనితీరును ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుతో రెండున్నర గంటలకు పైగా గురువారంనాడు వెలగపూడిలోని ఏపి సచివాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు.
కల్తీ ఆహార పదార్ధాలు, మందుల సరఫరాకు పాల్పడే వారిలో భయాన్ని కలిగించేలా తరచూ తనిఖీలు చేపట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐపిఎం,
డిసిఎ విభాగాలకు దీర్ఘకాలంగా రెగ్యులర్ విభాగాధిపతులు లేకపోవడంతో ఈ శాఖల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని మంత్రి అన్నారు.
డిజిపి స్థాయి పోలీసు అధికారి ఆధ్వర్యంలో డిసిఎ పనిచేయాల్సి ఉన్నందున, ఉన్నతాధికారుల కొరత ఉన్న నేపథ్యంలో ఐజిపి స్థాయి అధికారిని
డైరెక్టర్ జనరల్ డిసిఎగా నియమించేందుకు తగు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఐపిఎంకు డైరెక్టర్ పోస్టు ఇప్పటివరకు మంజూరు
కానందున, ఈ విభాగానికి మంజూరై ఖాళీగా ఉన్న కొన్ని స్థానాల్ని సరెండర్ చేసి డైరెక్టర్ పోస్టును సృష్టించాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి వివిధ స్థాయిల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి సమగ్ర నియామక ప్రణాళికను రూపొందించి నియామకాలు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో హైబ్రిడ్ పద్ధతిలో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం, పిపిపి విధానంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యల్ని శీఘ్రతరం చేయాలని మంత్రి ఆదేశించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు కృత్రిమ మేథ(ఎఐ) మరియు మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికత ఆధారంగా డిజిటల్ వైద్య సేవల్ని విస్తృతం చేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు పటిష్టమైన చర్యల్ని చేపట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి క్షేత్రస్థాయిలో సేకరించబడుతున్న సమాచారం నాణ్యత, విశ్వసనీయతలను క్షుణ్ణంగా మదింపు చేసి వాటిని పెంచడానికి తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి అన్నారు.