Suryaa.co.in

Editorial

ఇద్దరు ఐపిఎస్‌లపై వేటు

-నిఘా దళపతి పీఎస్సార్, బెజవాడ సీపీ తాతా బదిలీ
-ఎన్నికలతో సంబంధం లేని చోట పోస్టింగ్
-సీఈసీ ఆదేశాలు
-ఇక మిగిలింది సీఎస్, డీజీపీలే
-డీజీపీపై వేటు వేయకుండా నిఘా దళపతితో సరిపెడతారా?
-సీఎస్‌పై బదిలీ వేటు ఎప్పుడు?
-కూటమి నేతల అసంతృప్తి
-ఈసీ చర్యలతో ఐఏఎస్-ఐపిఎస్‌లలో వణుకు
-డీఎస్సీ, జేసీ, సీఐలలో ఆందోళన
-వైసీపీకి పనిచేస్తే వేటేనని ఈసీ సంకేతాలు
-తమను వైసీపీ కాపాడలేదని భయాందోళన
-నూట్రల్‌గా ఉండాలని డీఎస్పీ, సీఐల నిర్ణయం
( అన్వేష్)

విజయవాడ: అనుకున్నదే జరుగుతోంది. కాకపోతే కొంచెం ఆలస్యంగా. ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతాపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. వీరిద్దరికి ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నిజానికి ఎన్డీఏ కూటమి చాలారోజుల నుంచి.. ఇన్చార్జి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి, ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా తాతాతోపాటు.. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ముగ్గురు డీఎస్పీలు, మరికొందరు పోలీసు అధికారులను, ఎన్నికల వరకూ ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఈసీకి ఫిర్యాదు చేసింది.
బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అయితే.. ఎవరిని తప్పించాలన్న జాబితాతోపాటు, ఎవరు సమర్ధులన్న జాబితా కూడా సమర్పించారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి మనుషులుగా ముద్రపడి, ప్రకాశం-నెల్లూరు జిల్లాలకు బదిలీ అయిన డీఎస్పీలపైనా చర్యలు తీసుకోవాలని, కూటమి ఫిర్యాదు చేసింది. వారికి ఒంగోలు వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆ జిల్లాలకు పోస్టింగు ఇప్పించారని ఆరోపించింది.

ప్రధానంగా సీఎస్ జవహర్‌రెడ్డి పెన్షన్ల విషయంలో, ఈసీ ఆదేశాలు ఉల్లంఘించి జగన్ పార్టీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారంటూ ఫిర్యాదు చేసింది. ఇక ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేసింది.

అయితే విచిత్రంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉన్న సీఎస్ జవహర్‌రెడ్డి, ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని తొలగించకుండా.. ప్రత్యక్షప్రమేయం లేకుండా, కేవలం తెరవెనుక నిర్ణయాలు తీసుకునే ఇంటలిజన్స్ చీఫ్‌ను తప్పించడమే ఆశ్చర్యం. నిజానికి దేశంలో ఏ ఎన్నికలయినా ఇన్చార్జి డీజీపీ ఆధ్వర్యంలో జరగవు. అలా జరిగిన దాఖలాలు కూడా లేవు.
పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నప్పటికీ.. ఎన్నికల సంఘం ఇప్పటిదాకా డీజీపీ నియామక ప్రక్రియపై సీరియస్‌గా దృష్టి సారించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అయితే సీఎస్‌ను తొలగించిన తర్వాత, డీజీపీ నియామక ప్రక్రియపై దృష్టి సారిస్తారని, కొత్త సీఎస్ మాత్రమే డీజీపీని నిర్ణయించవచ్చు, లేదా ఈసీనే నేరుగా నియమించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నారు.

తాజాగా ఇద్దరు కీలక ఐపిఎస్ అధికారులపై బదిలీ వేటుతో.. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే, ఐఏఎస్-ఐపిఎస్ వర్గాల్లో సహజంగానే ఆందోళన మొదలయింది. జాయింట్ కలెక్టర్, డీఎస్పీ, సీఐ, స్థాయి అధికారుల్లో అయితే భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ నేతల ఫిర్యాదు ఎదుర్కొంటున్న ఈ స్థాయి అధికారులు, తమపై ఎప్పుడు వేటు పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. ఈ విషయంలో మంత్రులు-ఎమ్మెల్యేలను ఆశ్రయించినా తామేమీ చేయలేమని చేతులెత్తేయడంతో, ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్న పరిస్థితి.

ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఎంత అనుకూలంగా పనిచేసినా.. ఎన్నికల సమయంలో తమపై చర్యలు తీసుకుంటే ఎవరూ కాపాడలేరన్న విషయం, వారికి ఇప్పుడు ఇద్దరు ఐపిఎస్ అధికారులపై వేటుతో బోధపడినట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈసీ తాజా చర్యలతో ఎన్నికల సమయంలో తటస్థంగా ఉండాలన్న మానసిక భావన వారిలో కనిపిస్తోంది.
ఎందుకంటే ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే తమకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వదని, మళ్లీ కొత్త పోస్టింగులు వచ్చేంతవరకూ జీతం కూడా రాని దయనీయ పరిస్థితిని, గతంలోనే చూసినందున.. వైసీపీ సర్కారుకు అనుకూలంగా పనిచేయకూడదని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

‘ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసి ఈసీ ఆగ్రహానికి గురైతే, రేపు వచ్చే టీడీపీ ప్రభుత్వం మాకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుంది. అదే ఇప్పుడు న్యూట్రల్‌గా ఉంటే రేపు ప్రభుత్వం మారితే కనీసం లూప్‌లైన్‌లోనయినా ఉద్యోగం చేసుకోవచ్చు. పోస్టింగ్ లేకుండా ఏళ్ల తరబడి వెయిటింగ్‌లో ఉన్న మా వాళ్ల బాధలు చూస్తున్నాం కదా? నెలజీతం రాకపోతే కష్టమవుతుంది. అందుకే ఆ బాధలేకుండా ఉండాలంటే, ఎన్నికల్లో న్యూట్రల్‌గా పనిచేయడమే మంచిది. ఇప్పుడు మాపై ఈసీ చర్యలు తీసుకుంటే మమ్మల్ని వైసీపీ ప్రభుత్వం గానీ, మాకు పోస్టింగు ఇప్పించిన ఎమ్మెల్యేలు గానీ ఎవరూ కాపాడలేరన్న విషయం ఈరోజు మరోసారి తేలింద’’ని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన డీఎస్పీ ఒకరు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE