– తెలుగు జాతిని అగ్రపథాన నిలపడమే ఏకైక లక్ష్యం
– రాష్ట్ర జాతీయ ఉత్పత్తి 2.4 ట్రిలియన్ డాలర్లు..,
– తలసరి ఆదాయం 42 వేల డాలర్లు.. 2047 నాటికి లక్ష్యాలు
– అగ్రిటెక్ విధానాలతో రైతులకు న్యాయం చేస్తాం
– పరిశ్రమలు ఎక్కడొచ్చినా భాగస్వాములుగా స్థానిక రైతులు
– క్లీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దాలని సంకల్పం
– విజన్ డాక్యుమెంట్‌తో పాటు 20 కొత్త పాలసీలు
– అధికారం-అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రత్యేక దృష్టి
– 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు
– రేపటి నుంచి ఆంధ్రా వ్యాలీ ఓ సక్సెస్ స్టోరీ అవుతుంది
– సంకల్ప సిద్ధికి ప్రజలంతా చేతులు కలపాలి
– రాష్ట్రాభివృద్ధికి సుస్థిర ప్రభుత్వం అవసరం
– విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి చంద్రాబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చేలా స్వర్ణాంధ్ర – 2047 విజన్‌ను ఆవిష్కరించడం జరిగిందని, ప్రపంచంలోని తెలుగు జాతిని ఉన్నత స్థానంలో నిలపడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో బీజం పడిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తూ విజన్ డాక్యుమెంట్ తీసుకురావడం తమ అకుంఠిత దీక్షకు నిదర్శనమని అన్నారు.
ఈ మహాసంకల్పంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. చారిత్రక సమావేశానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మనందరం గర్వపడే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని అన్నారు. 2047లో మనం వందేళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరపుకుంటామని, ఆ నాటికి భారతదేశం అగ్రదేశంగా మారాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ – 2047ను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం కూడా ఒక స్పష్టమైన లక్ష్యంతో స్వర్ణాంధ్ర-2047ను విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవడం జరిగిందన్నారు.
విజన్-2020 స్ఫూర్తి
తెలుగు నేల ఔనత్యానికి, తెలుగు జాతి మేధో సంపత్తికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టిన విజన్-2020 స్ఫూర్తితో మరో గొప్ప దార్శనిక డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర-2047 ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానం వేదికగా జరిగింది. పది సూత్రాల వృద్ధి సోపానాలతో విలువైన విజన్ సాక్షాత్కరించింది. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, రైతు-వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్), శక్తి-ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత మార్గదర్శక సూత్రాల నవపథం ఆవిష్కృతమైంది.
ఆవిష్కరణ సభకు ముందుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి వివిధ రంగాల్లో సాధికారత దిశగా అడుగులు వేస్తున్న మహిళలు, విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ మహిళా రైతును పలకరించారు. వినూత్న విధానాలను అనుసరిస్తూ సంపద సృష్టిలో భాగస్వాములు అవుతున్న వారి స్టాళ్లను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములైన వివిధ రంగాలకు చెందిన వారు తమ మనోగతాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర – 2047 ఏవీని ప్రదర్శించారు. అనంతరం స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డాక్యుమెంట్‌పై సంతకాలు చేసి, బృహత్కర కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నాం
తాను 1978 నుంచి అనేక ఎన్నికల్లో పోటీచేశాను కానీ, 93 శాతం సక్సెస్ రేటు, 57 శాతం ఓటు బదిలీని 2024 ఎన్నికల్లో మాత్రమే చూశానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో అన్నారు. పవన్ కళ్యాణ్ వంటి మంచి మిత్రుడు ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. పాలన చేపట్టాక చూస్తుంటే మా ఊహలకన్న ఎక్కువ విధ్వంసం జరిగిందని తెలిసిందన్నారు. గాడితప్పిన పరిపాలనను చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని అన్నారు.
ప్రస్తుతం మన రాష్ట్రంలో తలసరి ఆదాయం మూడువేల డాలర్ల కంటే తక్కువగా ఉందని, 2047 నాటికి తలసరి ఆదాయాన్ని 42 వేల డాలర్లుకు చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా మేమందరం రాళ్లు మాత్రమే చూశామని.. మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అంటుంటారని గుర్తుచేశారు. ఆ రోజు తాను అక్కడ ఒక సింగపూర్‌ను, దుబాయ్‌ను చూశానని.. న్యూయార్క్ వంటి నగరాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదనే ఆలోచన చేసి, ముందుకెళ్లాను అని చెప్పారు.
ముందుచూపు వల్లే హైదరాబాద్ ముందుంది
ఆనాడు చేసిన విజన్, పునాది కారణంగా హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. ‘‘1997లో 14 టాస్క్‌ఫోర్స్‌లు వేశాం. గంటల తరబడి కూర్చున్నాం. దేశంలో తొలిసారి ఓ విజన్ డాక్యుమెంట్‌ను తయారుచేశాం. విజన్-2020ను 1999, జనవరి 26న ఆవిష్కరించాం. దాని ఫలితాలను ఈ రోజు చూస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఇదేవిధంగా స్వర్ణాంధ్ర – 2047 విజన్ సాకారమవుతుందని, అందుకు మీరందరూ ప్రత్యక్ష సాక్షులు కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
విజన్ డాక్యుమెంట్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చెప్పాలంటూ మేము ఒక పిలుపునిస్తే ఏకంగా 17 లక్షల మంది ఆన్‌లైన్లో తమ అభిప్రాయాలు తెలియజేశారని వివరించారు. 4.50 లక్షల మంది పాఠశాల విద్యార్థులు, 38 వేల మంది కళాశాల విద్యార్థులు విజన్‌పై నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. వినూత్న ఆలోచనలు వెల్లడించారని, పారిశ్రామికవేత్తలు, నీతి ఆయోగ్, ఇంకా పలు సంస్థల సభ్యులతో దీనిపై సమీక్ష చేసి, అందరం కలిసి ఈ విజన్ డాక్యుమెంట్‌ను తయారుచేశామని వివరించారు.
తెలుగుజాతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది ఎన్‌టీఆర్
ఇలాంటి శుభసందర్భంలో నందమూరి తారకరామారావు గారిని ఒకసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైనా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. తెలుగుజాతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్‌టీఆర్ అని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు అమలుచేసి దేశ ఆర్థిక స్థితిని మార్చిన వ్యక్తి తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు అని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప వారసత్వం మన దగ్గర ఉందన్నారు.
1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యానని, ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే, జీవన ప్రమాణాలు పెరగాలంటే సంస్కరణలు తప్పవని ఆనాడే భావించానని.. కఠిన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. దేశ భవిష్యత్ కూడా మార్చే శక్తి ఓ పబ్లిక్ పాలసీకి ఉంటుందని పేర్కొన్నారు. ఆనాడు ఐటీని ప్రమోట్ చేయడం వల్ల నేడు అమెరికాతో పాటు అన్ని దేశాల్లో అత్యధిక తలసరి ఆదాయాన్ని తెలుగుబిడ్డలు సంపాదిస్తున్నారని వివరించారు.
ఇండియన్స్ ఇప్పటికే గ్లోబల్ లీడర్స్ అయ్యారని, గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వచ్చారని చెప్పారు. వివిధ దేశాల ప్రభుత్వాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. కార్పొరేట్ రాజ్యంలో కూడా మనవాళ్లే ముందున్నారని అన్నారు. 18 ఏళ్ల దొమ్మరాజు గుకేష్ అతి చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ కావడం తెలుగుజాతి సత్తాకు ప్రతీకన్నారు.
జీరో పావర్టీకి అత్యంత ప్రాధాన్యం
మన దగ్గర మెరికల్లాంటి యువత ఉన్నారని.. తిరుగులేని మానవవనరులు, సహజ వనరులు, నదులు, సముద్రతీరం ఉన్నాయని.. వీటన్నింటినీ సక్రమంగా ఉపయోగించుకుంటే ఏదైనా సాధ్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనే లక్ష్యంతో పది సూత్రాలతో స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం.. పేదలే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి ఎన్‌టీఆర్.. ఆ స్ఫూర్తితోనే నేడు జీరో పావర్టీ కోసం సంకల్పించామని వివరించారు.
పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీ 4) విధానం ద్వారా నిరుపేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషిచేయడం జరుగుతుందని వివరించారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త రావాలనేది తన సంకల్పమని చెప్పారు. 2047 నాటికి ఇది తప్పక నెరవేరుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే దిశగా కృషిచేస్తున్నామని, ఇందుకు పాలసీలు తెస్తున్నట్లు వివరించారు. మంచి పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించి, రాష్ట్రంలో నాలెడ్జ్ సొసైటీని తయారు చేసుకోవాల్సిన అవసరముందని పునరుద్ఘాటించారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని పేర్కొన్నారు.
నదుల అనుసంధానంతో కరువు తలెత్తదు
తెలుగుదేశం పార్టీ చేసిన కృషివల్ల నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చిందని, ఈ ఏడాది భగవంతుడు కరుణించాడని ముఖ్యమంత్రి అన్నారు. ఈ రోజు అన్ని రిజర్వాయర్లలో దాదాపు 750 టీఎంసీల నీళ్లు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచనా విధాన ఫలితమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పట్టిసీమ తరహాలో నదుల అనుసంధానం వల్ల కరువు అనే మాటరాదన్నారు. గోదావరి నుంచి పెన్నా వరకు నీళ్లు తీసుకెళ్లే అంశంపై ఎన్‌డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని.. బనకచర్ల వరకు తీసుకెళ్లగలిగితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందే పరిస్థితి వస్తుందన్నారు.
మరోవైపు గోదావరి, వంశధార అనుసంధానంపైనా ఆలోచిస్తున్నామని, ఇదే జరిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి అనేది ఉండదని, దక్షిణ భారతంలోనే మనం నెంబర్‌వన్ రాష్ట్రంగా మారే పరిస్థితి వస్తుందని వివరించారు. అందుకే నీటి భద్రతకు విజన్ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని సంకల్పించామని తెలిపారు. రైతులను రాజు చేయాలనేది ఎన్‌డీఏ ప్రభుత్వం లక్ష్యమని, పంట ఉత్పత్తులకు విలువను జోడిస్తే రైతుకు మెరుగైన ఆదాయం వస్తుందని తెలిపారు.
అగ్రీ టెక్ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సంకల్పించామని, అన్ని వాహనాలను ఈవీ వాహనాలుగా తయారు చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. కరెంటు ఛార్జీల్లో ఆప్టిమైజేషన్ తీసుకురావాలని చూస్తున్నామని, గతేడాది 5 రూపాయల 19 పైసలుగా ఉన్న ప్రొక్యూర్‌మెంట్ సగటు వ్యయాన్ని ఈ ఏడాదికి నాలుగు రూపాయల 80 పైసలకు తగ్గించామని, ఇంకా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
అభివృద్ది వికేంద్రీకరణకు ప్రాధాన్యం
వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగం, టెక్.. ఇలా దేనికి సంబంధించిన ఉత్పత్తి అయినా ప్రపంచ మార్కెట్లో పోటీపడేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామని ముఖ్యమంత్రి అన్నారు. స్వచ్ఛాంధ్ర మన జీవితంలో భాగం కావాలని, స్వచ్ఛమైన రాష్ట్రంతో పాటు స్వచ్ఛమైన ఆలోచనలూ ముఖ్యమని పేర్కొన్నారు. ఆలోచనలు కలుషితమైతే వాతావరణం కూడా కలుషితమవుతుందని పేర్కొన్నారు.
డేటా భవిష్యత్‌లో గొప్ప సంపద అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని పనిచేయగలిగితే మన ఉత్పాదకత పెరుగుతుందని, సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. వీటన్నింటినీ సాకారం చేసేందుకు విజన్ డాక్యుమెంట్‌తో పాటు 20 కొత్త పాలసీలు తీసుకొచ్చామని వివరించారు. జాబ్ ఫస్ట్ విధానంతో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, ప్రైవేటు పార్కు పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, టూరిజం పాలసీలను తీసుకొచ్చామని వివరించారు.
త్వరలో పర్యాటకానికి కొత్త ఊపు వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కనీసం 20 నుంచి 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ తయారు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు పెడుతున్నామని తెలిపారు.
వీటివల్ల 5 లక్షల మందికి ఉపాధి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ వల్ల రాష్ట్రం ఎనర్జీ హబ్‌గా తయారవుతుందని, ఇందులో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావాలని, 7 లక్షల 50 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వివరించారు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతూ ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు భూమి రైతులు ఇచ్చిన ఘనత అమరావతి రైతులదని పేర్కొన్నారు.
రైతులు గత అయిదేళ్లు బాధపడ్డారని, వారిపై కేసులను విత్‌డ్రా చేయడమే కాకుండా పాలసీలను పునరుద్ధరించి ఆ రైతులను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఎక్కడైనా పరిశ్రమలు వస్తే రైతులను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ అమలుకు సమగ్ర రోడ్ మ్యాప్ తయారు చేశామని తెలిపారు.
స్వర్ణాంధ్ర-2047లో భాగస్వాములు అవ్వండి
2047 నాటికి 2.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల రాష్ట్ర జాతీయ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల తలసరి ఆదాయం 42 వేల అమెరికన్ డాలర్లకు చేరుకుంటుదన్నారు. ఈ విజన్ ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలని.. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని.. రాష్ట్రాన్ని దేశంలో నెంబర్‌వన్‌గా నిలపడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఇప్పటివరకు అందరం సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడామని, రేపటి నుంచి ఆంధ్రా వ్యాలీ ఓ సక్సెస్ స్టోరీ అవుతుందని చెప్పారు. ఇచ్ఛాపురం నుంచి మంత్రాలయం వరకు ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సుస్థిర ప్రభుత్వం ఉండాలని చెప్పారు. తనను నమ్మిన తెలుగు జాతిని పైకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతోనే తాను పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.