Suryaa.co.in

Editorial

సామాన్యులు ప్రారంభించిన టీవీ చానెల్‌ ‘స్వతంత్ర’

-తెలుగు మీడియా చరిత్రలో వినూత్న ఆవిష్కరణ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒక టీవీ చానెల్‌ను ఎవరితో ప్రారంభిస్తారు?
సహజంగా అయితే ప్రధాని.. కేంద్రమంత్రి.. ముఖ్యమంత్రి.. వీళ్లెవరూ కాకపోతే సెలబ్రిటీలు.
అంతే కదా?
అవును. అంతేగా.. అంతేగా.
ఇక్కడ మాత్రం అంతే కాదు. యస్‌. తాజాగా తెలుగునాట జరిగింది రొటీన్‌కు భిన్నం.
ఎందుకంటే ఆ చానెల్‌ ట్యాగ్‌లైనే సామాన్యుడి చానెల్‌..
దాని స్లోగనే సామాన్యుడి స్వరం.
అందుకే…
ఒక శ్మశాన కాటికాపరి.. ఒక కుమ్మరి.. ఒక జాలరి.. ఒక భక్తుడు.. ఒక పూజారి.
ఇలా… సామాన్యులే ముఖ్య అతిథులై.. సామాన్యులే సెలబ్రిటీలయి ఆ న్యూస్‌చానెల్‌కు శుభాకాంక్షలు చెప్పి, ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఏంటీ.. నమ్మడం లేదా? అవునండీ.. ఇది నిజంగా నిఝం.
ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు, సెలబ్రిటీలు లేకుండా తెలుగునాట ఒక శాటిలైట్‌ న్యూస్‌చానెల్‌ పురుడుపోసుకుంది. సామాన్యుడి ఆశీర్వాదంతో ఒక కొత్త చానెల్‌ ఆవిష్కృతమయింది.
ఆ న్యూస్‌చానెల్‌ పేరు స్వతంత్ర.
ఆదివారం తెలుగునాట మీడియా రంగంలో స్వతంత్రంగా ఉదయించిన.. ‘స్వతంత్ర’ చానెల్‌.

ఎవరికీ ఆరోవేలు కాకుండా, సామాన్యుడి స్వరం వినిపించే లక్ష్యంగా… వార్తా ప్రపంచంలో ఉదయించిన ‘స్వతంత్ర’ న్యూస్‌చానెల్‌ను, ఎండీ కృష్ణప్రసాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 5లో ఆదివారం ఉదయం ప్రారంభించారు. సికింద్రాబాద్‌ శ్రీనివాసనగర్‌లోని శ్రీ పసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయ వేద పండితుల వేదాశీర్వచనం, పండితుల పూజామహోత్సవం నడుమ స్వతంత్ర న్యూస్‌ చానెల్‌ వార్తా ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

ఇప్పటికే ‘ది పయనీర్‌’ ఆంగ్లపత్రికను.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా నడిపిస్తున్న సీనియర్‌ జర్నలిస్టు కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో, కొత్తగా టీవీ న్యూస్‌చానెల్‌ ఆవిష్కృతమయింది. సీనియర్‌ జర్నలిస్టులు, సాంకేతిక నిపుణుల దన్నుతో పురుడుపోసుకున్న ‘స్వతంత్ర’ న్యూస్‌ చానెల్‌.. భవిష్యత్తులో సృష్టించబోయే అద్భుతాలకు ఆదివారం తొలి అడుగుపడింది.

సహజంగా న్యూస్‌ చానెలంటే వీవీఐపీలు ప్రారంభిస్తుంటారు. ఇప్పటివరకూ అదే జరుగుతోంది. కానీ రొటీన్‌కు భిన్నంగా.. సామాన్యులే ఇలా ఒక న్యూస్‌చానెల్‌ను ప్రారంభించడమే, తెలుగు మీడియారంగంలో కొత్త ఒరవడి. నిజానికి ఇదో విభిన్నం, వినూత్నం. తెలుగు మీడియా రంగంలో ‘స్వతంత్ర’తో ఆరంభమయిన ఈ నూతన ఆవిష్కరణ, ఎంతమందికి ఆదర్శమవుతుందో చూడాలి.

LEAVE A RESPONSE