– అధికారులకు మంత్రి తలసాని ఆదేశం
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశువులు, ఇతర జీవాలు వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
గురువారం డాక్టర్ బి ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జీవాలకు అవసరమైన అన్ని మందులు పశువైద్యశాలలో అందుబాటులో ఉంచాలని, పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పశువులన్నింటికి ముందు జాగ్రత్త చర్యగా ఎటువంటి రోగాలు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయడం, నట్టల నివారణ మందులు త్రాగించడం వంటి చర్యలు చేపట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హా ని ఆదేశించారు.
అత్యవసర సేవలకు మొబైల్ వెటర్నరీ క్లినిక్ టోల్ ఫ్రీ నెంబర్ 1962 కి ఫోన్ చేసి పశువులకు అవసరమైన వైద్య సేవలను పొందే విధంగా రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పశువులు రోగాల బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించాలని ఆదేశించారు. పశు పోషకులు స్వచ్ఛమైన నీరు , గడ్డిని అందించవలసినదిగా సూచించారు.
నీటి ప్రవాహానికి, నది తీరాలకు, కరెంట్ తీగలకు దూరంగా పశువులను కట్టి ఉంచాలని సూచించారు. రైతులకు అవసరమైన సేవలు అందించడం కోసం రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. రామచందర్ ను ఆదేశించారు.