Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిభకు ప్రోత్సాహం లభించాలి

– తానా ఫౌండేషన్ ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమంలో ఆర్పి సిసోడియా వెల్లడి

ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించడం ద్వారా తానా ఫౌండేషన్ గొప్ప కార్యాన్ని నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి. సిసోడియా ప్రశంసించారు. అమెరికా ప్రవాసభారతీయులు స్థాపించిన తానా ఫౌండేషన్ అధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం విజయవాడలోని ఇంధ్రప్రస్థ హెూటల్లో జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సిసోడియా మాట్లాడుతూ, జీవితంలో అత్యంత విలువైనది విద్యయే అన్నారు. విద్య ద్వారానే విజ్ఞానం, జ్ఞానం అలవడుతుందని, అదే మనిషికి అంతులేని ఐశ్వర్యంగా పేర్కొన్నారు. అయితే నేడు సమాజంలో ఆర్థిక స్థోమత లేక ఎందరో ప్రతిభ ఉన్న విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అందుకోలేకపోతున్నారని అలాంటి వారికి దాతలు ముందుకువచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఎన్.ఆర్.ఐ లు కొంత మంది విదేశాలకు వెళ్లి తమ దేశంను మర్చిపోతున్నారని, కాని తెలుగు వారు మాత్రం ఎక్కడ ఉన్నా జన్మ భూమిని మర్చిపోక తమవంతు సహాయం అందిస్తున్నారని అందులో తానా ఫౌండేషన్ ప్రథమ స్ధాయంలో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యానికి తానా ఫౌండేషన్ ఇంకా సహాయం చేయాలని సభాముఖంగా కోరారు. అతిధిగా విచ్చేసిన మాజీ డిజిపి మాలకొండయ్య విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తానా ఫౌండేషన్కు అభినందనలు తెలిపారు.

తానా ఫౌండేషన్ సెక్రటరీ వల్లపల్లి శ కాంత్ మాట్లాడుతూ, తానా ఫౌండేషన్ ద్వారా రూ.400 కోట్ల విలువైన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తానా చేయూత అనే కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థులకు 1000 నుంచి 1500 ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి 1500 నుంచి 2000 స్కాలర్షిప్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంచుకుంటే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 175 మంది విద్యార్థులకు విద్యార్థులకు సుమారు 18 లక్షల రూపాయల విలువ చేసే ఉపకార వేతనాలు పంపిణి చేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, తానా ఇండియా కోఆర్డినేటర్ కెఆర్కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE