-దళిత ఏజంట్ మాణిక్యరావుకు రక్షణ కల్పించండి
-బాధితుడితో కలిసి డీజీపీని కలిసిన వర్ల రామయ్య
-జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు ఎస్పీకి డీజీపీ ఆదేశం
మంగళగిరి: రాష్ట్రంలో తాలిబాన్ తరహా పాలన నడుస్తున్నదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆందోళన వ్యక్తంచేశారు. మాచర్ల నియోజకవర్గం కళ్లకుంటకు చెందిన టిడిపి దళిత ఏజంటు మాణిక్యరావును వెంటబెట్టుకుని వర్ల రామయ్య ఆదివారం రాత్రి డీజీపీని కలిశారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ…13వతేదీన ఎన్నికలరోజు కళ్లకుంటలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి కళ్లకుంటలో దళితుడైన టిడిపి పోలింగ్ ఏజంట్ మాణిక్యరావును పోలింగ్ అధికారులు, పోలీసుల ముందు ఇష్టారాజ్యంగా కొట్టారు.
దళితుడివి ఏజంటుగా నిలబడతావా అని ఎమ్మెల్యే తమ్ముడు వెంకట్రామిరెడ్డి దుర్భాషలాడుతూ రౌడీయిజం చేశారు. ఆ తర్వాత మాణిక్యరావు ఇంటికి వెళ్లి ఆయన భార్యను, ఇద్దరు కొడుకులను ఇష్టారాజ్యంగా కొట్టారు, కొడుకును పొత్తికడుపులో, భార్యను జుట్టుపట్టుకుని కొట్టారు. మనం ఎపిలో ఉన్నామా, ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా అర్థంకావడం లేదు. ట్రైనీ డిఎస్పీ జగదీష్ ఇక్కడ ఉంటే చంపేస్తారని మాణిక్యరావును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఆయన భయపడి హైదరాబాద్ వెళ్లి చంద్రబాబు నంబర్ తెలుసుకుని రక్షణ కల్పించాలని కోరాడు. ఆయన ఆదేశాల మేరకు న్యాయవాదులతో కలసి మాణిక్యరావు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మంగళగిరిరూరల్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐని కోరితే మాచర్ల వెళ్లమన్నాడు, అక్కడకు వెళ్తే పరిస్థితులు లేవని చెప్పినా ఎస్ఐ విన్పించుకోలేదు. జీరో ఎఫ్ఐఆర్ పై ఎస్ఐకి అవగాహనలేదు, డిఎస్పీ, సిఐలకు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో డీజీపీని కలిస్తే జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని ఎస్పీని ఆదేశించారు.
కోటేశ్వరరావు మాచర్ల వెళ్లే పరిస్థితులు లేవు, అతను మాచర్ల వెళ్తే పిన్నెల్లి సోదరులు ముక్కలుముక్కలుగా నరికేస్తారు. మాణిక్యరావు అనే దళితుడైన పోలింగ్ ఏజంట్ ను ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు నేతృత్వంలో రౌడీగ్యాంగ్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి సిబ్బంది, అధికారుల ముందు కొట్టినా పట్టించుకునే నాథుడు లేడు. బాధితుడికి రక్షణ ఇవ్వలేని దుర్మార్గపు పరిపాలన రాష్ట్రంలో నడుస్తోంది. మాణిక్యరావు, ఆయన కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి, ఈ అరాచకపాలనకు మరికొద్ది రోజుల్లోనే తెరపడబోతుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు.