– రక్తం, మంటలతో ఎరుపెక్కిన ఎర్రకోట పరిసరాలు
– ఢిల్లీ నడిబొడ్డున కారుబాంబు పేలుడు
– 5 కార్లు పూర్తిగా ధ్వంసం, సమీపంలోని మరికొన్ని
– 13 మంది మృతి, మరో 10 మంది పరిస్థితి విషమం, 30 మందికి గాయాలు
– ఆ కారు బీహారీదేనన్న ఢిల్లీ పోలీసులు
– ఒకరి అరెస్టు, ఢిల్లీలో రెడ్ అలర్ట్
– ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన హోంమంత్రి అమిత్‌షా
– రాత్రివరకూ పరిస్థితిని సమీక్షించిన అమిత్‌షా
– ప్రధాని మోదీ, రాహుల్, సీఎం చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, పవన్ కల్యాణ్, భట్టి, సత్యకుమార్‌యాదవ్, లోకేష్, కేటీఆర్ ఖండన
– మృతుల కుటుంబాలకు సంతాపం
– కేంద్రానికి బాసటడగా నిలవాలని పిలుపు
– హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన ప్రధాని మోదీ
– దేశమంతా రెడ్అలర్ట్
న్యూఢిల్లీ: ఎర్రకోట పరిసరాలు.. సాయంత్రం వేళ బాంబు పేలుడు, అగ్నిజ్వాలలతో ఎర్రబారింది. బాధితుల ఆర్తనాదాలతో అట్టుడికిపోయింది. కాళ్లు తెగి, చేతులు కోల్పోయిన బాధితుల ఆర్తనాదాలు, హాహాకారాలతో ప్రతిధ్వనించాయి.
బీహార్ రిజిస్ట్రేషన్ ఉన్న కారు ఒక్కసారిగా పేలడంతో ఎర్రకోట ప్రాంతం ఉలిక్కిపడింది. ఆ ధాటికి సమీపంలోని 5 కార్లు పూర్తిగా ధ్వంసం కాగా, మరికొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. ఆ పేలుళ్లకు భయపడిన పర్యాటకులు పరుగులు తీశారు. తాజా పరిణామాలతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు.
కాగా బాంబు పేలుడు వార్త తెలిసిన వెంటనే కేంద్రహోంమంత్రి అమిత్‌షా పోలీసులతో సమీక్ష నిర్వహించారు. సంఘటనా స్థలిని పరిశీలించిన ఆయన, ఆసుపత్రిలోని క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నతస్థాయ సమీక్ష నిర్వహించారు.
ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిని ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పెమ్మసాని సీఎం చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, అనిత, అనగాని సత్యప్రసాద్, సుభాష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో భారీ పేలుళ్ళు జరిగాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర కారులో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. మరోవైపు పేలుడు కారణంగా పరిసరాల్లో ఉన్న కార్లకు మంటలు అంటుకోగా.. సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకుంది. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.
పేలుడు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సిగ్నల్ వైపు నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనంలో పేలుడు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపారు. ఆత్మాహుతి దళాల ప్రమేయం ఉందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన 70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయం ఉంది. సోమవారం కావడంతో ఆలయ సందర్శనకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు ముగించుకొని జనాలు ఇళ్లకు చేరే సమయంలో భారీ పేలుళ్లు జరిగాయి. దీంతో చాందినీ చౌక్, ఎర్రకోట పరిసరాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
అమిత్ షా తో ప్రధాని నరేంద్ర మోడీ సంభాషించారు. సంఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. దరియా గంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సాయంత్రం 6:55 కు పేలుళ్లు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. పేలుళ్ల ధాటికి భూమి భారీగా కంపించిందంటున్నారు. పేలుళ్ల దెబ్బకు 6 కార్లకు మంటలు వ్యాపించాయి. నాలుగు ఆటో రిక్షాలు, 4 బైకులు దగ్ధమయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే 8 మంది మృతి చెందారు. 30 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. మరో 10 మంది పరిస్థితి విషమం.
సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
స్పాట్ కు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చేరుకున్నారు. మీడియాతో సహా ఎవరినీ పేలుడు జరిగిన స్థలానికి పోలీసులు అనుమతించలేదు. క్షతగాత్రులను ఎల్ఎన్జెపీ [లోకనాయక్ ఆసుపత్రి] ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా, ఢిల్లీ పేలుళ్లతో ఉత్తర ప్రదేశ్, వాణిజ్య రాజధాని ముంబై మహానగరం పోలీసులు అప్రమత్తమయ్యారు. అయోధ్య రాం మందిర్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
—————-
ఢిల్లీపై కుట్ర భగ్నం
ఢిల్లీపై ఉగ్రవాదుల కుట్రను పోలీసు భగ్నం చేశారు. తమకు అందిన సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు నిందితులను అరెస్టు చేయడంతో, ఢిల్లీపై వారి కుట్రను భగ్నం చేసినట్టయింది.
ఢిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. హరియాణాలోని ఫరిదాబాద్ లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధిత పేలుడు పదార్థాలు, ఒక రైఫిల్ సహా 20 టైమర్లను స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా వెల్లడించారు. వీటితో పాటు మూడు మ్యాగజైన్లు, పిస్టల్, వాకీటాకీ సెట్‌ను స్వాధీనపరచుకున్నట్టు పేర్కొన్నారు.
ముజమ్మిల్ షకీల్అనే మరో డాక్టర్ వద్ద కూడా పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రి నిల్వ ఉన్నట్టు తేలింది. దీంతో పుల్వామాకు చెందిన షీకల్‌నూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఫరిదాబాద్‌లోని ఆల్-ఫలాహ్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళా వైద్యురాలి కారులో ఒక రైఫిల్, పిస్టల్ బయటపడ్డాయి. ఆమె మందుగుండు సామాగ్రిని నిల్వచేసేందుకు వినియోగించిన కారును, స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు.