– అటు రాజగోపాల్‌రెడ్డి.. ఇటు వెంకటరెడ్డి.. మధ్యలో రేవంత్‌రెడ్డి
– తమ్ముడు ద్రోహి, అన్న త్యాగి అంటున్న రేవంత్
– రేవంత్ వివరణతో వెంకటరెడ్డి శాంతిస్తారా?
– ఇప్పటికే రేవంత్ ముఖం చూడనన్న వెంకటరెడ్డి
– రేవంత్‌ను తిట్టిన తమ్ముడి విమర్శలను అన్న వెంకటరెడ్డి ఖండించరా?
– చెరకు సుధాకర్ వస్తే నష్టమేమిటంటున్న కాంగ్రెస్ నేతలు
– కాంగ్రెస్‌ను ముంచుతున్న మును‘గోడు’
( మార్తి సుబ్రహ్మణ్యం)
అటు పార్టీ నుంచి వెళ్లిపోతున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఇటు పార్టీలో ఉంటూ తమ్ముడిపై పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహిస్తున్న అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీరి మధ్యలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ముగ్గురి మధ్య ట్రయాంగిల్ వార్. ‘టాటా-బిర్లా మధ్యలో లైలా’ సినిమా మాదిరి నడుస్తోన్న తెలంగాణ కాంగ్రెస్ సినిమా రోజుకో మలుపు తిరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా ప్రకటించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తన నిష్ర్కమణకు కారకుడయిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని విడిచిపెట్టడం లేదు. రేవంత్‌పై ఆయన తన విమర్శల బాణాలు సంధిస్తూనే ఉన్నారు. రేవంత్‌రెడ్డి తాజాగా రాజగోపాల్‌రెడ్డి వ్యాపారాలు, ఆయనతోపాటు కుటుంబసభ్యులకు కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలను మీడియా ముందు ఏకరవుపెట్టిన తీరు.. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కంటే, అన్న వెంకటరెడ్డినే ఎక్కువ గాయపరచడం ప్రస్తావనార్హం. రేవంత్‌రెడ్డి విమర్శనాస్ర్తాలు తననే గుచ్చుకున్నాయని బాధపడిన వెంకటరెడ్డి.. ఇకపై తాను రేవంత్‌రెడ్డి ముఖం చూడనని చెప్పేశారు. గతంలో కూడా ఓసారి ఇలాగే తాను గాంధీభవన్ మెట్టు ఎక్కనని తెగేసి చెప్పారు.
రేవంత్.. తన తమ్ముడు రాజగోపాల్‌ను విమర్శించడం కంటే.. తన రాజకీయ ప్రత్యర్ధి, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకురావడమే వెంకటరెడ్డికి రుచించలేదన్నది ఆయన వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో తన ఓటమికి పనిచేసిన సుధాకర్‌ను, తనకు చెప్పకుండా కాంగ్రెస్‌లోకి ఎలా తీసుకుంటారన్నది వెంకటరెడ్డి అసలు బాధ. అందుకే రేవంత్‌రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని రుసరుసలాడిన వెంకటరెడ్డి, ఇకపై తాను రేవంత్ ముఖం చూసేదే లేదుపొమ్మని ప్రకటించారు.
అయితే.. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి చేసింది సరైనదేనన్న వాదన తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసే సందర్భంలో.. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన విమర్శలను ఒక పార్టీ ఎంపీగా, దానికి మించి ఆయన నియోజకవర్గ ఎంపీగా, అంతకుమించి.. పీసీసీ స్టార్క్యాంపెయినర్గా ఉన్న వెంకటరెడ్డి స్పందించకపోవడం పార్టీలో విమర్శలకు దారితీసింది. తమ్ముడి రాజీనామాతో తనకు సంబంధం లేదన్న వెంకటరెడ్డి.. మరి తన పార్టీ అధ్యక్షుడిపై తమ్ముడి ఆరోపణలను, ఎందుకు ఖండించలేదన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఒకటేనని అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పైగా త్వరలో మునుగోడు ఉప ఎన్నిక ముంచుకువస్తున్నందున.. అక్కడ ప్రత్యామ్నాయం చూడాల్సిన బాధ్యత, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌పైనే ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి పరిస్థితిలో చెరకు సుధాకర్ వంటి బలమైన నేతలను, పార్టీలోకి తీసుకురావలసిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. రేపు వెంకటరెడ్డి కూడా హటాత్తుగా తమ్ముడి మాదిరిగానే పార్టీ నుంచి నిష్క్రమిస్తే, ఆయన వెళ్లే వరకూ మరొక నేతను ప్రత్యామ్నాయంగా చూడకుండా వేచిచూడాలా? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఎంతోమంది, ఆ తర్వాత అదే గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలున్న పార్టీలో చేరడం లేదా? అలాగే చెరకు సుధాకర్ కాంగ్రెస్‌లో చేరితే తప్పేమిటి? అని కాంగ్రెస్ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.
దశాబ్దాలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉత్తమ్‌రెడ్డి, కోమటిరెడ్డి కుటుంబాలు తమ నియోజకవర్గాల పరిథిలో మరొకరిని రానీయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ వంటి ప్రముఖుడు పార్టీలోకి వస్తుంటే స్వాగతించాల్సింది పోయి, వస్తున్నందుకు విమర్శించడంపై పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పైగా పార్టీ అధ్యక్షుడిపై తమ్ముడి విమర్శలను ఇప్పటిదాకా ఖండించకుండా, తాను రేవంత్ ముఖం చూడననడమే వింతగా ఉందని సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా వెంకటరెడ్డిని బుజ్జగించేందుకు, రేవంత్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అటు తమ్ముడిని తిడుతూనే, ఇటు అన్నను ఆకాశానికెత్తిన రేవంత్ తెలివైన వ్యూహం చర్చనీయాంశంగా మారింది. వెంకటరెడ్డి పార్టీ కోసం చాలాచేశారని, ఆయన మునుగోడు ఎన్నిక ప్రచారానికి వస్తారని తెలివిగా అన్నను ఇరికించే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. తాను వెంకటరెడ్డిని ఏమాత్రం కించపరచలేదని, కేవలం రాజగోపాల్‌రెడ్డి చేసిన ద్రోహాన్ని మాత్రమే ప్రస్తావించానంటూ.. రేవంత్ లౌక్యంగా చేసిన వ్యాఖ్యలు, మరి వెంకటరెడ్డిని శాంతింపచేస్తాయో లేదో చూడాలి.